హబీబుల్లాఖాన్ ఆకస్మిక మృతి
వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడి మృతికి పలువురి సంతాపం
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ ముస్లిం మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ హబీబుల్లా ఖాన్ (62) రాజమహేంద్రవరం ఆజాద్ చౌక్‌లోని తన నివాసంలో శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ఆయన టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఆధ్వర్యాన ఆజాద్ చౌక్ వేదికగా 2020లో భారీ ఎత్తున ఎంపీలు, రాష్ట్ర స్థాయి నాయకుల సమక్షంలో పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే ఏసీవై రెడ్డి శిష్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించిన హబీబుల్లా ఖాన్ 40 సంవత్సరాలుగా అజాజ్ సెంటర్‌లోని లాబాబిన్ లైన్ మసీద్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా కొనసాగుతున్నారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా, రాజమహేంద్రవరం నగర అధికార ప్రతినిధిగా, రాజమహేంద్రవరం జేఏసీ కన్వీనర్‌గా పలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హబీబుల్లా ఖాన్ పార్థివ దేహాన్ని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ సందర్శించి ఘనంగా నివాళి అర్పించారు. హబీబుల్లా ఖాన్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని, హబీబుల్లా ఖాన్ కుటుంబానికి పార్టీ తరఫున నిరంతరం అండగా ఉంటామని అన్నారు. మసీదు అభివృద్ధి ఆయన కోరిక అని, తమ పార్టీ అధికారంలోకి రాగానే దీనిని నెరవేరుస్తామని చెప్పారు. వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, పార్టీ నాయకులు కానుబోయిన సాగర్, మజ్జి అప్పారావు, దాసి వెంకటరావు, కాటం రజనీకాంత్‌తో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన పలువురు నాయకులు హబీబుల్లా ఖాన్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. కాగా, హబీబుల్లా ఖాన్ మృతికి సంతాపంగా ఆజాద్ చౌక్‌లోని అన్ని షాపులను పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా మూసివేసి సంతాపం ప్రకటించారు.
క్రమశిక్షణ కలిగిన నాయకుడిని కోల్పోయాం
హబీబుల్లా ఖాన్ మృతికి రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజ్ సంతాపం తెలిపారు. ఆత్మీయుడు, క్రమశిక్షణ, నిబద్ధత, కార్యదక్షత కలిగిన ముస్లిం మైనార్టీ నాయకుడిని వైఎస్సార్ సీపీ కోల్పోయిందని, ఆయన కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని సంతాప సందేశంలో పేర్కొన్నారు. హబీబుల్లా ఖాన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పార్టీకి తీరనిలోటు
రాజమహేంద్రవరం రూరల్: హబీబుల్లా ఖాన్ మృతి వైఎస్సార్ సీపీకి తీరని లోటని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హబీబుల్లా ఖాన్ మృతికి తీవ్ర సంతాపం, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
హబీబుల్లాఖాన్ ఆకస్మిక మృతి


