రత్నగిరిపై భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

రత్నగిరిపై భక్తుల రద్దీ

Nov 1 2025 8:02 AM | Updated on Nov 1 2025 8:02 AM

రత్నగ

రత్నగిరిపై భక్తుల రద్దీ

సత్యదేవుని దర్శించిన 30 వేల మంది

1,800 వ్రతాల నిర్వహణ

దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం

అన్నవరం: కార్తిక శుద్ధ దశమిని పురస్కరించుకుని సత్యదేవుని దర్శించేందుకు వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శుక్రవారం రద్దీగా మారిపోయింది. మోంథా తుపాను అనంతరం తొలిసారిగా అధిక సంఖ్యలో భక్తులు సత్యదేవుని సన్నిధికి తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచి సాయంత్రం 4 గంటల వరకూ రద్దీ కొనసాగింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద దీపాలు వెలిగించారు. సుమారు 30 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు 1,800 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.

నేడు లక్ష మందికి వస్తారని అంచనా

కార్తిక శుద్ధ ఏకాదశి పర్వదినం కావడంతో శనివారం సత్యదేవుని సన్నిధికి లక్ష మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి వ్రతాలు పది వేలకు పైగా జరుగుతాయని భావిస్తున్నారు. వ్రతాల నిర్వహణ అర్ధరాత్రి ఒంటి గంటకే ప్రారంభించనున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి స్వామివారి దర్శనానికి కూడా భక్తులను అనుమతించనున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి స్వామివారి వ్రతాలు, దర్శనాల టిక్కెట్లు విక్రయించనున్నారు.

రేపు, ఎల్లుండి కూడా రద్దీ

క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం కావడంతో ఆదివారం, ఆ మర్నాడు కార్తిక సోమవారం పర్వదినాలు కావడంతో ఆ రెండు రోజులూ కూడా భక్తులు అధిక సంఖ్యలోనే వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు రోజులు కూడా అర్ధరాత్రి ఒంటి గంట నుంచే వ్రతాల నిర్వహణ, తెల్లవారుజామున 2 గంటల నుంచే స్వామివారి దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు. ఆది, సోమవారాలలో కూడా 15 వేలకు పైగా సత్యదేవుని వ్రతాలు జరిగే అవకాశం ఉంది. వ్రత మండపాలతో పాటు స్వామివారి నిత్య కల్యాణ మండపంలో కూడా వ్రతాలు నిర్వహిస్తారు. అన్ని మండపాల్లో ఏక కాలంలో 1,400 మంది భక్తులు సత్యదేవుని వ్రతాలు ఆచరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు రామాలయం ఎదురుగా సర్కులర్‌ మండపం వద్ద పులిహోర, దద్ధోజనం పంపిణీ చేయనున్నారు.

తెప్పోత్సవం, గిరి ప్రదక్షిణ ఏర్పాట్ల పరిశీలన

క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా ఆదివారం సత్యదేవుని తెప్పోత్సవం నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీనికోసం పంపా జలాశయం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ వీర్ల సుబ్బారావు శుక్రవారం పరిశీలించారు. తెప్పోత్సవంలో ఉపయోగించే పంటును పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయానికల్లా తెప్పోత్సవం ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, కార్తిక పౌర్ణమి సందర్భంగా నవంబర్‌ 5న జరగనున్న సత్యదేవుని గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై కూడా చైర్మన్‌, ఈఓలు సాయంత్రం సమీక్షించారు. గిరి ప్రదక్షిణ రోడ్డును పరిశీలించి తగు సూచనలు చేశారు. గిరి ప్రదక్షిణ మార్గంలో మంచినీటి సరఫరా, పండ్లు, పులిహోర పంపిణీ పాయింట్లు, టాయిలెట్ల ఏర్పాట్లపై సిబ్బందికి సూచనలిచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఈలు నూకరత్నం, రామకృష్ణ, ఏఈఓలు ఎల్‌.శ్రీనివాస్‌, అనకాపల్లి ప్రసాద్‌, ఎలక్ట్రికల్‌ డీఈ సత్యనారాయణ, ఫార్మసీ సూపర్‌వైజర్‌ మాధవి తదితరులు పాల్గొన్నారు.

రత్నగిరిపై భక్తుల రద్దీ1
1/1

రత్నగిరిపై భక్తుల రద్దీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement