ఎకరాకు రూ.25 వేల పరిహారం
● కౌలు రైతు సంఘం డిమాండ్
● కౌలుదార్లను ఆదుకోవాలని విన్నపం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): మోంథా తుపాను వల్ల నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యాన కాకినాడ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.రాజశేఖర్ మాట్లాడుతూ, గతంలో వారం రోజుల వరకూ పంటల నష్టాన్ని అంచనా వేసే వారని, కానీ ఈసారి అధికారులు రెండు రోజుల్లోనే హడావుడిగా దీనిని పూర్తి చేశారని చెప్పారు. ఇప్పుడు తడిసిన ధాన్యం పని చేయవని, అందువల్ల అందరికీ పూర్తి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్నదాత సుఖీభవ పథకంలో ఇవ్వాల్సిన నగదును వెంటనే కౌలు రైతులకు అందించాలని, భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డు ఇవ్వాలని కోరారు. కేరళ, తెలంగాణ రాష్ట్రాల మాదిరిగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని, మొలకెత్తిన ధాన్యం సైతం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కలెక్టర్ షణ్మోహన్‌కు వినతి పత్రం అందించారు.


