నేడు పింఛన్ల పంపిణీ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లా వ్యాప్తంగా శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయనున్నామని కలెక్టర్ కీర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మొత్తం 2,35,031 మంది లబ్ధిదారులకు వారి ఇంటి వద్దనే మొత్తం రూ.103.17 కోట్లు పంపిణీ చేస్తామన్నారు. పెన్షన్ పంపిణీకి 4,975 మంది అధికారులు సమన్వయంతో పని చేస్తారని తెలిపారు.
దేశ ఐక్యతకు ప్రతీక
వల్లభాయ్ పటేల్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): భారత సమాఖ్యలో వివిధ సంస్థానాలను విలీనం చేసిన దేశ తొలి ఉప ప్రధాని, స్వాతంత్య్ర సమర యోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను భారత ఉక్కు మనిషిగా అభివర్ణిస్తారని జాయింట్ కలెక్టర్ వై.మేఘాస్వరూప్ అన్నారు. వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పటేల్ స్ఫూర్తితో దేశ ఐక్యతకు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జేసీ మేఘాస్వరూప్ మాట్లాడుతూ, పటేల్ దేశ ఐక్యతకు ప్రతీకని అన్నారు. ధైర్యం, పట్టుదలతో 565 సంస్థానాలను భారత సమాఖ్యలో విలీనం చేసి, దేశ సమగ్రతకు పునాదులు వేశారని కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ టి.సీతారామమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈవీఎంల గోడౌన్ పరిశీలన
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): స్థానిక లాలాచెరువు వద్ద ఎఫ్‌సీఐ గోదాముల ఆవరణలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) భద్రపరచిన గోడౌన్‌ను డీఆర్‌ఓ టి.సీతారామమూర్తి, ఆర్‌డీఓ ఆర్.కృష్ణానాయక్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ పరిశీలన చేశామన్నారు. ఈవీఎంలను సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూము ల్లో భద్రపరిచామని, సీసీ కెమెరాల పనితీరును, భద్రతా ఏర్పాట్లను పరిశీలించామని వివరించారు. కార్యక్రమంలో అర్బన్ తహసీల్దార్ పాపారావు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
యథాతథంగా పంటు రాకపోకలు
సఖినేటిపల్లి: నర్సాపురం – సఖినేటిపల్లి రేవులో శుక్రవారం యథాతథంగా పంటు రాకపోకలు ప్రారంభమయ్యాయి. మోంథా తుపాను కారణంగా అధికారుల ఆదేశాలపై రేవు వద్ద తాత్కాలికంగా పంటు ప్రయాణాన్ని పాటదారులు నిలుపుదల చేశారు. రేవు వద్ద తిరిగి పునరుద్ధరించిన పంటు సేవల పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నేడు పింఛన్ల పంపిణీ


