వానలు తగ్గాక రోడ్డు మరమ్మతులు
● మంత్రి దుర్గేష్
● కానూరు – ఉసులుమర్రు
మధ్య రోడ్డు పరిశీలన
పెరవలి: వర్షాలు తగ్గిన వెంటనే నిడదవోలు – నర్సాపురం రోడ్డు మరమ్మతులు చేపడతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ‘‘అం‘దారి’కీ అవస్థలే’’ శీర్షికన ‘సాక్షి’ శుక్రవారం ప్రచురించిన కథనానికి ఆయన స్పందించారు. ఆర్‌అండ్‌బీ అధికారులతో కలసి రోడ్డుపై పడిన గోతులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిడదవోలు నియోజకవర్గంలో దెబ్బ తిన్న రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తానని చెప్పారు. కానూరు – ఉసులుమర్రు గ్రామాల మధ్య రోడ్డు బాగా దెబ్బ తిందని, ఇక్కడ రూ.3 కోట్లతో సిమెంటు రోడ్డు నిర్మిస్తామని తెలిపారు. తీపర్రు – వడ్లూరు రోడ్డు నిర్మాణానికి రూ.3.24 కోట్లు మంజూరయ్యాయని, కాల్దారి రోడ్డు నిర్మాణానికి రూ.60 లక్షలు, దమ్మెన్ను, ఉండ్రాజవరాన్ని కలుపుతూ కానూరు – లంకలకోడేరు రోడ్డు నిర్మాణానికి రూ.4.20 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ఈ రోడ్ల పనులు త్వరలోనే చేపడతామన్నారు. నియోజకవర్గంలో వివిధ రోడ్ల నిర్మాణానికి రూ.11 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. మరికొన్ని రోడ్ల నిర్మాణానికి రూ.8.30 కోట్లతో అనుమతులు వచ్చాయని, టెండర్లు పిలిచి, ఆమోదం లభించిన తరువాత వీటి పనులు చేపడతామని వివరించారు. నిడదవోలు – నరసాపురం రోడ్డు దుస్థితిని, తమ కష్టాలను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’కి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
వానలు తగ్గాక రోడ్డు మరమ్మతులు


