తిన్నారంటే తిప్పలే.. | - | Sakshi
Sakshi News home page

తిన్నారంటే తిప్పలే..

Oct 22 2025 7:08 AM | Updated on Oct 22 2025 7:08 AM

తిన్న

తిన్నారంటే తిప్పలే..

రావులపాలెం/అమలాపురం టౌన్‌: ఇటీవల కాలంలో స్ట్రీల్‌ ఫుడ్‌ వ్యాపారం విపరీతంగా పెరిగింది. వీధుల్లో ఏర్పాటు చేసే చిన్న చిన్న బళ్ల వద్ద ఆహార పదార్థాలను తీనేవారు ఎక్కువయ్యారు. పిల్లలతో సరదాగా బయటకు వచ్చిన తల్లిదండ్రులు, షికారుకు వచ్చిన యువత, వాకింగ్‌ వచ్చిన పెద్దలు.. ఇలా అందరూ బండ్లపై అమ్మే పదార్థాలను ఇష్టంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రోడ్ల చెంతన, వీధుల్లో ఫాస్ట్‌ఫుడ్‌, టిఫిన్‌ సెంటర్లు, బజ్జీ దుకాణాలు, పానీపూరీ బండ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే వీటి నిర్వాహకుల్లో కొందరు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు.

ప్రతి వీధిలోనూ..

రావులపాలెంతో పాటు ప్రధాన జాతీయ రహదారి, ఆర్‌అండ్‌బీ రోడ్లు విస్తరించిన పరిసర గ్రామాల్లో రోడ్ల వెంబడి అనేక ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు వెలిశాయి. దీనికి తోడు మిరపకాయ బజ్జీలు, న్యూడిల్స్‌, పానీపూరీ, మాంసం పకోడీ విక్రయించే తోపుడు బండ్లు ప్రతి వీధిలోనూ దర్శనమిస్తున్నాయి. అయితే వీరిలో కొందరు వ్యాపారులు ఒకే నూనెను అనేకసార్లు మరిగించి, వాడడం వల్ల వినియోగదారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. క్యాన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాధులకు కారణవుతోంది. ఇలా ఆహార కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నది తొలుత యువతే. ఇటీవల ఏదైనా సుస్తీ చేసి ఆస్పత్రులకు వెళితే తొలుత డాక్టర్లు.. ఫాస్ట్‌ ఫుడ్‌, వీధి బళ్లమీద విక్రయించే ఆహారం తీసుకోవద్దని సలహా ఇస్తున్నారు.

నిఘా కరవు

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లపై ఫుడ్‌ సేఫ్టీ, పంచాయతీ, పొల్యూషన్‌ కంట్రోల్‌ అధికారుల నిఘా కరవైంది. కేవలం పెద్ద హోటళ్లపై మాత్రమే దాడులు, తనిఖీ చేస్తున్నారు. తర్వాత రాజకీయ ఒత్తిళ్లతో కేసులను నీరుగార్చేస్తున్నారు. రావులపాలెంలో ఇటీవల ప్రముఖ హోటళ్లపై ఫుడ్‌ సేఫ్టీ, విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. అలాగే రాజకీయ, ఆర్థిక పలుకుబడులతో నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. కానీ స్ట్రీట్‌ ఫుడ్‌ దుకాణాలను ఏ అధికారులూ పట్టించుకున్న దాఖలాలులేవు.

పొగతో కాలుష్యం

కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు, ఆత్రేయపురం పరిసర గ్రామాల రోడ్ల చెంత తాత్కాలికంగా ఫాస్ట్‌ ఫుడ్‌, న్యూడిల్స్‌, పానీపూరీ, మాంసం పకోడీ షాపులు, తోపుడు బండ్లు అనేక ఉన్నాయి. ఈ వ్యాపారులందరూ రోజూ సాయంత్రం నాలుగింటికి తమ వ్యాపారం మొదలు పెడతారు. మరిగించిన నూనెలోనే పదార్థాలను తయారు చేయడం వల్ల తిన్నవారి ఆరోగ్యం పెను ప్రమాదంలో పడుతోంది. న్యూడిల్స్‌, పానీపూరీ, ఫ్రైడ్‌ రైస్‌ కూడా ఈ కోవలోకే వస్తాయి. అలాగే ఈ షాపులు, తోపుడు బండ్లపై గ్యాస్‌ సిలిండర్ల వాడడం, నూనె మరగడం వల్ల వచ్చే పొగతో వెలువడే ఆయా ప్రాంతాల్లో కాలుష్యం కమ్ముకుంటోంది. రావులపాలెంలో హైవే సర్వీసు రోడ్డు, రింగ్‌ రోడ్డు, పార్కు వద్ద, మార్కెట్‌ సెంటర్‌, రైతు బజార్‌ సెంటర్‌, ఊబలంక రోడ్డు, అమలాపురం రోడ్డు ఇలా చెప్పుకుంటూ పోతే ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, రెడీమేడ్‌ ఆహార పదార్థాలు విక్రయించే తోపుడు బండ్లు అనేకం దర్శనమిస్తాయి. ఒక్క రావులపాలెం పంచాయతీ పరిధిలో స్ట్రీట్‌ పుట్‌ బండ్లు సుమారు 60 వరకూ ఉన్నట్టు సమాచారం.

జిల్లా కేంద్రంలో..

జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణంలో హోటళ్లు, పాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు రెట్టింపు అయ్యాయి. అయితే పలు హోటళ్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లలో ఆహారం కలుషితం అవుతోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఒక మాంసాహార హోటల్‌లోని పలావులో మండ్ర కప్ప ఉందన్న విషయం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. దీంతో మున్సిపాలిటీ, ఫుడ్‌ సేఫ్టీ అధికారుల్లో కదలిక మొదలైంది. అప్పటి వరకూ పలు మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో కొందరు కౌన్సిలర్లు పట్టణంలో కలుషిత ఆహారం అధికమవుతోందని ఆందోళన చెందినా కదలిక లేదు. అమలాపురం పట్టణం వ్యాప్తంగా పలు కూడళ్లలో దాదాపు 24 వరకూ పాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు ఉన్నాయి. వాటిలో పదార్థాల తయారీకి ఉపయోగించే పొయ్యిల గొట్టాలను రోడ్డు వైపు పెట్టేస్తున్నారు. వాటి నుంచి ఆయిల్‌ తుంపర్లు, పొగ విపరీతంగా వెలువడుతోంది. హోటళ్ల కంటే ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లలోనే ఆహార కలుషితం ఎక్కువ అవుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంబాజీపేటలోని ఓ హోటల్‌లో టిఫిన్‌ తిన్న 20 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవడంతో కలుషిత ఆహారంపై ప్రజల్లో మరింత ఆందోళన పెరిగింది. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తరచూ హోటళ్లు, పాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లపై దాడులు, తనిఖీలు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

విపరీతంగా పెరిగిన

ఫాస్ట్‌ ఫుడ్‌ దుకాణాలు

కొన్నింటిలో నాణ్యతకు తిలోదకాలు

లైసెన్సులు లేకుండా వ్యాపారం

ప్రమాదంలో ప్రజారోగ్యం

దృష్టి సారించని అధికారులు

పంచాయతీ పరంగా శానిటేషన్‌, ఎన్విరాల్‌మెంట్‌ పరిశుభ్రత అంటూ అధికారులకు ఈ సెంటర్లు, షాపులను తనిఖీ చేసే అధికారం ఉన్నా వారు ప్లాస్టిక్‌ కవర్లు తదితర సామగ్రిపైనే దృష్టి పెడుతున్నారు. కల్తీ ఆహార విక్రయాలు, కాలుష్యాన్ని పట్టించుకోవడం లేదు. గతంలో పంచాయతీలకు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఉండేవారు, ఇప్పుడు ఆ పోస్టులు లేకపోవడంతో పంచాయతీ సెక్రటరీలు, గుమస్తాలపై ఈ భారం పడింది. జిల్లా స్థాయిలో ఫుడ్‌ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ అధికారులు ఈ తరహా దుకాణాలను తనిఖీలు చేస్తే నిర్వాహకులకు కనీసం భయమైనా ఉంటుంది. ఈ దుకాణాల నిర్వహణకు ఎవ్వరూ లైసెన్సులు తీసుకోవడం లేదు. ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, రోడ్ల చెంత తిను బండారాలు విక్రయించే ప్రతి వీధి వ్యాపారి తప్పని సరిగా లైసెన్స్‌ పొందాలని ఫుడ్‌ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు.

తిన్నారంటే తిప్పలే..1
1/2

తిన్నారంటే తిప్పలే..

తిన్నారంటే తిప్పలే..2
2/2

తిన్నారంటే తిప్పలే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement