
యువకుడిపై కానిస్టేబుల్ దాడి
సామర్లకోట: కానిస్టేబుల్ తీవ్రంగా కొట్టడంతో ఓ యువకుడు ప్రాణాపాయస్థితికి చేరాడు. ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. దీపావళి సందర్భంగా ఏటా బ్రౌన్‌పేట – కోటపేటకు చెందిన యువకులు తారాజువ్వలను నేలబారున విడిచిపెట్టే పోటీ పెట్టుకుంటారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి రెండు వర్గాలకు చెందిన యువకులు జువ్వలు వేసుకోవడం ప్రారంభించారు. పోలీసులు అక్కడకు చేరుకుని రెండు పర్యాయాలు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో జువ్వల పోటీతో ఎటువంటి సంబంధం లేని దడాల అక్షయ కుమార్ అనే యువకుడు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అతడిని కానిస్టేబుల్ సతీష్ కుమార్ కొట్టడం ప్రారంభించాడు. ఆ క్రమంలో అక్షయ కుమార్ వీపుపై లాఠీ బలంగా తగలడంతో స్పృహ తప్పి పడిపోయాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్షయ కుమార్‌కు చిన్నతనం నుంచి పక్షవాతం ఉంది. ఎప్పుడైతే కానిస్టేబుల్ లాఠీతో కొట్టాడో అతడు కోమాలోకి వెళ్లాడు. ఆస్పత్రి సిబ్బంది వైద్యం ప్రారంభించిన కొద్ది సేపటికి ఊపిరి ఆగి పోవడంతో అక్షయ కుమార్ చనిపోయాడని భావించారు. ఇంతలో డాక్టర్ వచ్చి సీపీఆర్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే 108లో కాకినాడ తరలించడానికి ప్రయత్నం చేయగా దాదాపు గంటంపావు వరకూ అంబులెన్స్ అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత 108లో పోలీసుల సహకారంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజు, సీఐ ఎ.కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
బాధితుడికి న్యాయం చేయాలి
అమాయకుడైన అక్షయ కుమార్‌ను కానిస్టేబుల్ లాఠీతో కొట్టడం దారుణమని దళిత సంఘాల నాయకులు సతీష్ బాబు, లింగం శివప్రసాద్, నేతల హరిబాబు, పిట్టా సత్యనారాయణ అన్నారు. ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి, అరెస్టు చేయా లని డిమాండ్ చేశారు. అక్షయ కుమార్‌కు అవుట్ సోర్సింగ్‌లో ఉద్యోగం ఇవ్వాలన్నారు. గతంలో కూడా ఒక దళిత యువకుడు చనిపోవడానికి పోలీసులే కారణమని గుర్తు చేశారు. దీనిపై విచారణ చేసి క్షతగాత్రుడికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
ప్రాణాపాయ స్థితిలో బాధితుడు
గంటంపావు వరకూ రాని 108 అంబులెన్స్
కాకినాడ ఆస్పత్రిలో చికిత్స
తారాజువ్వల పోటీలో కలకలం