
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
కాకినాడ క్రైం: బేకరీలో పనిచేసే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ సంతచెరువు జంక్షన్‌లో ఉన్న ఎస్‌ఆర్‌కే బిల్డింగ్‌లో కర్ణాటకకు చెందిన కేఎస్ వెంకటేష్ అనే వ్యక్తి జై మారుతీ బెంగళూరు అయ్యంగార్ బేకరీ నడుపుతున్నాడు. ఈ భవనం కింద అంతస్తులో బేకరీ, మొదటి అంతస్తులో తయారీ కేంద్రం ఉంది. బాలాజీ చెరువుకు చెందిన ర్యాలీ లక్ష్మి (40) దాదాపు రెండు నెలలుగా ఈ తయారీ కేంద్రంలో పని చేస్తోంది. రోజూ మాదిరిగానే మంగళవారం ఆమె తయారీ కేంద్రానికి వచ్చింది. సాయంత్రం 5.30 సమయంలో అదే అంతస్తులో మరో దుకాణం నడుపుతున్న వ్యక్తి.. బేకరీ తయారీ కేంద్రంలో మహిళ పడిపోయి ఉండడాన్ని చూసి షాపు యజమాని వెంకటేష్‌కు సమాచారం అందించాడు. అతడు వెళ్లి చూసే సరికీ లక్ష్మి విగత జీవిగా కనిపించింది. ఆయన ఈ విషయాన్ని లక్ష్మి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించాడు. ఆమెను కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా, అప్పటికే లక్ష్మి మృతి చెందిందని వైద్యులు నిర్ధారణ చేశారు. ఈ ఘటనపై కాకినాడ త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. భర్తతో వేరుపడిన లక్ష్మికి పదేళ్ల కుమార్తె ఉంది. బేకరీలో పనిచేసుకుంటూ బాలికను పోషిస్తోంది.