
సర్కారు నిర్వాకం.. అన్నదాతకు అన్యాయం
ోరుకొండ: విత్తు నుంచి పంట దిగుబడుల విక్రయం వరకూ అన్నదాతకు అడుగడుగునా అండగా నిలిచే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే) ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రైతులకు విత్తనాలతో పాటు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందించేవారు. వీటిలో సిబ్బందిని నియమించి, సకాలంలో వ్యవసాయ సలహాలు, సూచనలు అందించారు. అలా ఎన్నో విధాలుగా ఈ ఆర్‌బీకేలు రైతులకు తోడుగా నిలిచేవి. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్‌బీకేల పేరును రైతు సేవా కేంద్రాలు(ఆర్‌ఎస్‌కే)గా మార్చారు. ఆ తరువాత నుంచి వీటిని క్రమంగా నిర్వీర్యం చేస్తూ వచ్చారు. తద్వారా రైతులకు సరైన సేవలు అందని పరిస్థితి ఏర్పడింది.
దీనిని అవకాశంగా తీసుకుని, ఆర్‌ఎస్‌కే భవనాలను ఇతర అవసరాలకు వినియోగించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదే కోవలో కోరుకొండ–1 ఆర్‌ఎస్‌కేలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేశారు. ఇప్పటి వరకూ కోరుకొండ పోలీస్ స్టేషన్ స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉంది. వర్షం కురిస్తే ఆ భవనం కారిపోతోంది. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్‌కు కొత్త భవనం నిర్మించాల్సింది పోయి, ఏకంగా ఆర్‌ఎస్‌కేలోనే మకాం పెట్టేశారు. అయితే, దీనిని రెండు నెలలకు మాత్రమే అడిగినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, ఇక్కడ లాకప్ వంటి శాశ్వత ఏర్పాట్లు చేశారు. రెండు నెలలకే అయితే, పక్కా ఏర్పాట్లు ఎందుకు చేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కోరుకొండ–1 ఆర్‌ఎస్‌కే పరిధిలో సుమారు 600 మంది రైతులు ఉన్నారు. సాగు సూచనల కోసం వస్తున్న రైతులు అక్కడ పోలీస్ స్టేషన్ దర్శనమివ్వడంతో నివ్వెరపోతున్నారు. దీనిపై అధికారులను వివరణ కోరితే గ్రామంలో కోరుకొండ–2 ఆర్‌ఎస్‌కే ఉందని, రైతులు అక్కడకు వెళ్లాలని చెబుతున్నారు.