
ముంపే మేజర్ సమస్య
ఫ అభివృద్ధికి దూరంగా శంకరగుప్తం డ్రైన్
ఫ ఏళ్ల కాలంగా పట్టించుకోని పాలకులు
ఫ ముంపు నుంచి రక్షించాలని రైతుల మొర
మలికిపురం: రాజోలు దీవిలో బంగాళాఖాతానికి కాస్త పైన, రెండు గోదావరి పాయల మధ్య సహజ సిద్ధంగా రక్తతుల్య నది ఏర్పడింది. ఇది క్రీక్ అని భౌగోళిక నదీ పరివాహక మ్యాప్‌లో ఉంది. ఈ క్రీక్‌కు బంగాళాఖాతానికి మధ్య ఏడు గ్రామాలతో మరో దీవి ఉంది. ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించాక కాటన్ మహాశయుడు ఈ క్రీక్‌కు శంకరగుప్తం మేజన్ డ్రైన్‌గా పేరు పెట్టారు. ఆనకట్ట నిర్మించిన సమయంలో ఏర్పడిన పలు కొత్త మేజర్, మైనర్ డ్రైన్లు, ప్రధాన కాలువల నుంచి శివారు కాలువలు ఈ డ్రైన్లలో కలిసేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడి నుంచి వైనతేయ మీదుగా సముద్రంలో కలుస్తుంది. అయితే మేజర్ డ్రైన్‌లోకి మురుగునీరు రావడం, ఒకవైపు సముద్ర పోటు పాట్లు, వరదల వేళ పోటెత్తడంతో యాభై ఏళ్లుగా ఈ క్రీక్ రైతులకు దుఃఖదాయినిగా మారింది.
సుమారు 80 గ్రామాలతో కూడిన రాజోలు దీవి కి మూడు వైపులా గోదావరి నది, మరోవైపు బంగాళాఖాతం ఉన్నాయి. మొత్తం గోదావరి నదికి వచ్చే వరద నీటిలో ఏటా సుమారు 90 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు అంటే మూడొంతుల్లో రెండొంతుల నీరు వశిష్ఠ, వైనతేయ పాయల మధ్యే సముద్రంలో కలుస్తుంది. సరిగ్గా ఈ రెండు పాయల మధ్యే శంకరగుప్తం డ్రైన్ ఉంది. క్రీక్ వైనతేయ నదిలో కలిసే ముఖ ద్వారానికి ఎదురుగా కూనవరం మేజర్ డ్రైన్ ఉంటుంది. అటు నుంచి వచ్చే ముంపునీరు కూడా ఈ డ్రైన్‌కు ఎదురు కావడం వల్ల శంకరగుప్తంపై భారీ ఒత్తిడి పడుతోందని డ్రైనేజీ శాఖ ప్రస్తుత అంచనా. శంకరగుప్తం డ్రైన్‌కు బంగాళాఖాతం వైపు ఉన్న ఏడు గ్రామాల దీవికి, రాజోలు దీవితో 1970 వరకూ వంతెనలే లేవు. పి.గన్నవరం అక్విడెక్ట్ కట్టిన తర్వాత నుంచి ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థపై ప్రభుత్వ శాఖలు శ్రద్ధ పెట్టలేదు. ఫలితంగా నేటికీ డ్రైన్లకు హద్దులు లేక ఆక్రమణలతో, ముంపు సమస్యలతో ఆనకట్ట రైతాంగం వ్యవసాయానికి దూరమవుతోంది.
అప్పటి నుంచీ ఇలా..
రాజోలు దీవిలో శంకరగుప్తం డ్రైన్‌తో అవస్థలు తొలగించాలని 1960 నుంచి ఆందోళనలు మొదలయ్యాయి. ఫలితంగా 1971–72 మధ్య కేశనపల్లి సర్పంచ్ యెనుముల బాపిరాజు హయాంలో రూ.లక్షతో శంకరగుప్తం డ్రైన్‌కు మరమ్మతులు చేశారు. అప్పట్లో తూర్పుపాలెం వైపు అడ్డుకట్ట వేసి సుమారు 400 మంది కార్మికులు కొన్ని నెలల పాటు పూడిక తీసి ఏటిగట్లు వేశారు. కనుమరుగైన ఆ ఏటిగట్లనే నేడు పునర్నిర్మించాలని అంతా కోరుతున్నారు. తిరిగి 1980లో డ్రైన్‌లో ముంపునీటి పారుదల మెరుగుకు డ్రైన్ చివరి భాగం అయిన కేశవదాసుపాలెం నుంచి నేరుగా సముద్రంలోకి స్ట్రెయిట్ కట్ తవ్వారు. ఇక్కడ మెరక వల్ల, సముద్ర కెరటాల ఉధృతి వంటి సాంకేతిక సమస్యలతో స్ట్రెయిట్ కట్ మూసుకుపోయి మురుగు కిందకు దిగని దుస్థితి నెలకొంది. తిరిగి 2006లో కేశవదాసుపాలెం నుంచి కత్తిమండ వరకూ అప్పట్లో రూ. 40 లక్షలతో పూడికతీసి గట్లు వేశారు. ఇది చాలా ఉపయోగపడింది. గట్లు వేయడం వల్ల ఉప్పునీరు పొలాలకు చేరకపోవడంతో రైతులకు మేలు జరిగింది. అనంతరం 2016లో రూ.15 కోట్లతో డ్రైన్ ముఖ ద్వారం కరవాక నుంచి కేశనపల్లి వరకూ 8 కిలోమీటర్ల మేర డ్రెడ్జింగ్ చేశారు. అప్పట్లో డ్రెడ్జింగ్ మట్టిని గట్లుగా వేయాలని ప్రతిపాదనలు ఉన్నా ఇంజినీర్లు, అప్పటి పాలకులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. గట్లు వేయకుండా, పూడిక మట్టిని నేరుగా రైతుల పొలాల్లోకి తరలించడంతో వేలాది ఎకరాలలో కొబ్బరి తోటలు దెబ్బతిన్నాయి.
నిధుల బట్టి చర్యలు
డ్రైన్ పొడవునా ప్రత్యేక బృందంతో అధ్యయనం చేశాం. ఇందులో ఇరిగేషన్‌కు చెందిన జీడీఎస్, సీడీఓ ఇంజినీర్ల బృందం ఉన్నారు. ముంపు నుంచి రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై నివేదికను ప్రభుత్వానికి అందజేశాం. నిధుల లభ్యతను బట్టి తదుపరి చర్యలు ఉంటాయి.
–ఎంవీవీ కిషోర్,
డ్రైనేజీ శాఖ ఈఈ, కాకినాడ
పార్టీలకతీతంగా ఏకమై..
శంకరగుప్తం డ్రైన్ ముంపు రాజోలు దీవిలో పది వేల మంది రైతులకు చెందిన సుమారు 20 వేల ఎకరాల్లో 1.50 లక్షల కొబ్బరి చెట్లను నాశనం చేసింది. ప్రస్తుతం ఈ ప్రాంత రైతులు, ప్రజలు పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తున్నారు. అయినా ఈ సమస్య పరిష్కారానికి రూ.15 కోట్లతో చేసిన ప్రతిపాదనలు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల మంత్రి నిమ్మల రామానాయుడు రాష్ట్ర ఇరిగేషన్ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావుతో పర్యటించి తిరిగి ప్రతిపాదనలు చేయాలని సూచించారు. ఈ నెలలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ డ్రైన్‌ను పరిశీలించనున్నారు. కొత్త ప్రతిపాదనలతో అంచనాలు రూ.30 కోట్ల వరకూ చేరే అవకాశం ఉంది. డ్రెడ్జింగ్ చేసి ఇరువైపులా ఆరు మీటర్ల వెడల్పుతో ఏటిగట్లు వేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనికిగాను ప్రస్తుత డ్రైన్‌వ వాస్తవ పరిస్థితిపై ఉన్నతాధికారులు సర్వే చేస్తున్నారు.

ముంపే మేజర్ సమస్య