
శ్రీప్రకాష్‌లో ధన్వంతరి జయంతి వేడుకలు
తుని: స్థానిక శ్రీప్రకాష్ ఆయుర్వేద ఆసుపత్రిలో ఆయుర్వేద మూల పురుషుడు ధన్వంతరి జయంతి, జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని శ్రీప్రకాష్ ఆయుష్ చారిటబుల్, రీసెర్చ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శ్రీప్రకాష్ ఆయుష్ చారిటబుల్, రీసెర్స్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు సీహెచ్‌వీకే నరసింహారావు, రామసీత దంపతులు ధన్వంతరి హోమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా ప్రముఖ ఆయుర్వేద వైద్యులు కన్నాలయం గోపాలన్ రవీంద్రన్, ప్రవచనకర్త, ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు హాజరయ్యారు. రవీంద్రన్‌ను చాగంటి కోటేశ్వరరావు సత్కరించారు. డాక్టర్ గోపాలన్ రవీంద్రన్ మాట్లాడుతూ ఆరోగ్యరమైన జీవనానికి ఆయుర్వేదం దిక్సూచి లాంటిదన్నారు. ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర తెలుసుకోవడం, పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానాన్ని పొందుతామన్నారు. ఉన్నత స్థితికి చేరడానికి గురువు దిక్సూచి అన్నారు. నరసింహారావు మాట్లాడుతూ ఈ ప్రాంత వాసులకు ఆయుర్వేద వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఆయుర్వేద చికిత్సాలయం స్థాపించామన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నారు. అకాడమీ ఆయుర్వేద ఆసుపత్రి ట్రస్టీ డాక్టర్ యు.ఇందులాల్, సైకాలజికల్ కౌన్సిలర్ అపర్ణశర్మ, శ్రీప్రకాష్ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్‌ప్రకాష్, ఆయుర్వేద చికిత్సాలయ సలహాదారుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్, ప్రధాన వైద్యులు టి.రమేష్‌బాబు, ఎంఏ సుమయ్య పాల్గొన్నారు.