విధుల్లోనే ఉండమంటారు! | - | Sakshi
Sakshi News home page

విధుల్లోనే ఉండమంటారు!

Oct 20 2025 9:08 AM | Updated on Oct 20 2025 9:08 AM

విధుల్లోనే ఉండమంటారు!

విధుల్లోనే ఉండమంటారు!

దీపావళికి నోచుకోని అగ్నిమాపక శాఖ

కుటుంబాలకు దూరంగా ఉండాల్సిందే!

ఖాళీ పోస్తులు భర్తీకాక మరింత ఇబ్బంది

కొత్తపేట: దీపావళి.. అందరికీ ఎంతో అమితమైంది. టపాసులు పేల్చుతూ, ఆ వెలుగులను చూసి కుటుంబంతో సంతోషంగా గడిపే రోజు అది. అలాంటి పండగకూ అగ్నిమాపక సిబ్బంది ఎప్పుడూ దూరమే.. ఎందుకంటే ఆ పండగ రోజునే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండడంతో, ఆ రాత్రంతా మేల్కొని విధులు నిర్వహిస్తామని ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు. ప్రతి అగ్నిమాపక కేంద్రం వద్ద విధుల్లో ఉండే ఫైర్‌మెన్‌ల పరిస్థితి దయనీయమనే చెప్పాలి. దీనికితోడు ఈ శాఖలో ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఉన్న సిబ్బందిపైనే ఒత్తిడి పెరిగి పండగ రోజుల్లోనూ అందరూ విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రభుత్వ శాఖలకు దీపావళి రోజు సెలవు అయినప్పటికీ, కానీ ఒక్క అగ్నిమాపక శాఖకు మాత్రం సెలవు ఉండదు. కచ్చితంగా విధులకు హాజరు కావాల్సిందే. ఎందుకంటే ఎక్కడ ఏ అగ్ని ప్రమాదం సంభవిస్తుందోనని అప్రమత్తంగా ఉంటూ డ్యూటీ చేయాలి. అంతేకాదు దీపావళికి వారం, పది రోజుల ముందు నుంచే ఆఫ్‌ కూడా తీసుకోకుండా ఆన్‌ డ్యూటీలో ఉండాలి. ఈ విధంగా వారు దీపావళి పండగకు దూరమవుతున్నారు.

సిబ్బంది లేక.. ఇబ్బంది

రాష్ట్రంలో పోలీసు, జైళ్ల శాఖ, ఏపీఎస్పీ, ఏఆర్‌ డిపార్ట్‌మెంట్లలో అన్ని ఖాళీలు భర్తీ చేశారు. కానీ అగ్నిమాపక శాఖలో మాత్రం ఖాళీలను మాత్రం భర్తీ చేయలేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 17 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రానికి లీడింగ్‌ ఫైర్‌మెన్‌, ఫైర్‌మెన్‌, డ్రైవర్లు, ఇలా సుమారు 15 మంది ఉండాలి. అలా జిల్లాలో సుమారు 255 మంది సిబ్బంది అవసరం. కానీ ప్రస్తుతం 147 మంది మాత్రమే ఉండడం గమనార్హం. ఇందులో అమరావతి, కూనవరం తదితర డ్యూటీలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సిబ్బందినే పంపిస్తున్నారు. అలా డ్యూటీ పడిన సిబ్బంది ప్రతి నాలుగు నెలలకు 15 రోజులు అదనపు డ్యూటీలు చేయాల్సి వస్తుందని ఆ శాఖ జిల్లా యూనియన్‌ నాయకులు చెబుతున్నారు. సిబ్బంది లేక ఇబ్బంది ఎదురవుతోందని, అగ్నిమాపక శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని వారు కోరుతున్నారు.

ఏ పండగ వచ్చినా ఇంతే..

ఒక్క దీపావళి మాత్రమే కాదు.. ఏ పండగకు నోచుకోం.. దీపావళి అంటే అగ్ని ప్రమాదాలకు అవకాశం ఉన్న పండగ. సంక్రాంతి పండగ అంటే ఎక్కడికక్కడ ప్రభల ఉత్సవాలు, ఊరేగింపులు, బాణసంచా కాల్పులు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇలా ప్రతి పండగ మా శాఖతో ముడిపడి ఉంటుంది. కుటుంబ ఆనందాలు వదులకుని ప్రజల ఆస్తి, ప్రాణ రక్షణ కర్తవ్యంగా పనిచేస్తున్నామని అగ్నిమాపక శాఖ సిబ్బంది చెబుతున్నారు. ప్రతి ఏడాది దీపావళికి ముందురోజు డ్యూటీ ఆఫ్‌ వస్తే టపాసులు కొని ఇంటికి తీసుకువెళ్లి ఇచ్చి జాగ్రత్తగా కాల్చుకోమని చెప్పి తిరిగి డ్యూటీకి వచ్చేవాళ్లమని, ఈసారి రాయవరంలో భారీ విస్ఫోటం కారణంగా ఆ అవకాశం కూడా లేకుండా పోయిందని వారు వాపోయారు.

వరుసగా

మూడు రోజులూ..

రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌ అండ్‌ ఆఫ్‌ డ్యూటీలు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో దీపావళికి రెండు రోజుల ముందు నుంచీ విధులు నిర్వర్తించాల్సిందే. వరుసగా దీపావళి వరకూ ఆన్‌ డ్యూటీలో ఉండాల్సిందే. ఇటీవల రాయవరంలో జరిగిన బాణసంచా పేలుడు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది తప్పనిసరి పరిస్థితుల్లో వరుసగా మూడు రోజులూ విధులు నిర్వర్తిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement