
కార్తిక స్నానాలకు గోదావరి ఘాట్లు సిద్ధం
రాజమహేంద్రవరం సిటీ: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల కోసం రామహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గోదావరి ఘాట్లను సిద్ధం చేస్తున్నారు. నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు వేలాదిగా వచ్చే అవకాశం ఉంది. మొత్తం 7 ఘాట్లలో పుణ్య స్నానాలకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రసిద్ధి చెందిన కోటిలింగాల ఘాట్, చింతాలమ్మ ఘాట్, దుర్గాదేవి ఘాట్, పుష్కర ఘాట్, మార్కండేయ స్వామి ఘాట్, సరస్వతీ ఘాట్, గౌతమ ఘాట్‌లలో స్నానాలు ఆచరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నదిలో దిగి స్నానం చేయలేని వృద్ధులు, చిన్నారులు, మహిళల కోసం దుర్గాదేవి ఘాట్ మినహా జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు భక్తులు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులను సిద్ధం చేశారు. పారిశుధ్య చర్యలు చేపట్టేందుకు కార్మికులను అదనంగా నియమించారు. రెండు షిఫ్ట్‌లలో సుమారు 80 మంది పని చేయనున్నారు. స్నానాలు ఆచరించే సమయంలో భక్తులకు ఏవిధమైన అసౌకర్యం లేకుండా ఘాట్‌లలో ఇసుకను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. కార్త్కి సోమవారం, పౌర్ణమి సమయాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తామని నగరపాలక సంస్థ శానిటరీ సూపర్‌వైజర్ ఐ.శ్రీనివాస్ వెల్లడించారు.

కార్తిక స్నానాలకు గోదావరి ఘాట్లు సిద్ధం