
4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
నిడదవోలు రూరల్: జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ఖరీఫ్ ధాన్యం సేకరణకు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు మండలం డి.ముప్పవరం పీఏసీఎస్ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ధాన్యానికి మద్దతు ధర రూ.69 అధికంగా ఇస్తామని చెప్పారు. కౌలు రైతులకు ఈ ఏడాది ప్రత్యేకంగా యూనిక్ నంబర్‌తో కార్డులు అందిస్తామన్నారు. అనంతరం ధాన్యం జల్లెడ, ధాన్యం నాణ్యత, గోనె సంచులు, తేమ శాతం కొలిచే యంత్రాన్ని, డిజిటల్ తూనిక యంత్రాలను మంత్రి దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, కొవ్వూరు ఆర్‌డీఓ రాణి సుస్మిత, జెడ్పీటీసీ సభ్యుడు కొయ్యే సూరిబాబు, తహసీల్దార్ బి.నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఆ వాయిస్ ఫేక్
టీడీపీ నేత మజ్జి రాంబాబు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): మద్యం వ్యాపారులతో మాట్లాడినట్లుగా వైరల్ అవుతున్న వాయిస్ తనది కాదని, అది ఫేక్ అని నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు స్పష్టం చేశారు. ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో నకిలీ వీడియోలు, వాయిస్‌లు సృష్టిస్తున్నట్లు చూస్తున్నామని, ఇది కూడా అలాంటిదేనని అన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. స్థానిక పాత సోమాలమ్మ పుంత రోడ్డులోని శ్రీకన్య ఇన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. మద్యం వ్యాపారులతో తాను మీటింగ్ పెట్టినట్లు నిరూపించాలని సవాల్ చేశారు. తనకు లిక్కర్ షాపులు లేవని, మద్యం వ్యాపారులతో మాట్లాడాల్సిన అవసరం లేదని రాంబాబు తెలిపారు.