కాకినాడ క్రైం: ఓ వివాహ వేడుకకు వెళ్లి ప్రమాదవశాత్తూ సాంబార్‌లో పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ వివరాల్లోకి వెళితే.. భీమవరం గునిపూడి ప్రాంతం అంబేడ్కర్ కాలనీకి చెందిన కటికల సునీల్‌కుమార్ (27) ఈ నెల 12న అదే ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకకు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ భోజనాలకు సిద్ధం చేసిన భారీ సాంబార్ బాణీలో పడిపోయాడు. అప్పుడే వండిన సాంబార్ వేడిగా ఉండడంతో దేహం కాలిపోయి తీవ్రగాయాల పాలయ్యాడు. సునీల్‌కుమార్‌ను అక్కడి వారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. నాలుగు రోజులుగా బర్న్స్ వార్డులో చికిత్స కొనసాగుతుండగా అతను శుక్రవారం మధ్యాహ్నం ప్రాణాలు కోల్పోయాడు. సునీల్‌కుమార్ నాలుగేళ్ల క్రితం తాను నివసిస్తున్న ప్రాంతానికే చెందిన నీలమను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు షాలేం రాజు ఉన్నాడు. కూలి పనులు చేసుకుంటూ భార్య, కుమారుడిని పోషించుకుంటున్న సునీల్ కుమార్ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
వ్యక్తి దుర్మరణం
శంఖవరం: కత్తిపూడి జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అన్నవరం పోలీసుల కథనం ప్రకారం.. సీతంపేట గ్రామానికి చెందిన బోడ రాంబాబు (65) కత్తిపూడిలో ఆసుపత్రికి వచ్చాడు. అక్కడ పెట్రోల్ బంక్ వద్ద హైవే దాటుతుండగా, తుని నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమాదు చేసినట్లు ఎస్సై జి.హరిబాబు తెలిపారు.