
ఆహా ఏమి రుచి.. అతిథులు మైమరచి..
● నన్నయలో ఆహార మహోత్సవ్ ప్రారంభం
● తొలిరోజు ఆకట్టుకున్న ‘తూర్పు’ రుచులు
● పోటాపోటీగా వంటకాల తయారీ
రాజానగరం: పిజ్జాలు, బర్గర్లు అంటూ రెడీమేడ్ ఫుడ్‌కు అలవాటు పడిన నేటి కాలంలో అసలైన సంప్రదాయ ఆహార పదార్థాల రుచులను గోదావరి వాసులు తమ వంటల ద్వారా నిరూపిస్తున్నారని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ అన్నారు. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనివర్సిటీలో డిపార్టుమెంట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే ఆహార మహోత్సవ్ 2025 బుధవారం ప్రారంభమైంది. గోదావరి జిల్లాల్లోని ఆహారపు అలవాట్లు, వంటకాల గురించి తెలియజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
స్టాళ్ల ఏర్పాటు
మొదటి రోజు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనుబంధ కళాశాల విద్యార్థులు, సిబ్బంది, తమ సన్నిహితులతో కలిసి సంప్రదాయ, ఆరోగ్యకర ఆహార పదార్థాలను తయారు చేయడంలో పోటీ పడ్డారు. తాము తయారు చేసిన పదార్థాలతో స్టాళ్లు ఏర్పాటు చేశారు. వాటిని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, పలువురు అతిథులు, యూనివర్సిటీ, కళాశాలల ఉద్యోగులు, విద్యార్థులు సందర్శించి రుచులను ఆస్వాదించారు. గురువారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అనుబంధ కళాశాలల విద్యార్థులు, సిబ్బంది తమ వంటలతో పోటీపడనున్నారు. అనంతరం విజేతలకు బహుమతులు, పోటీల్లో పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు అందజేస్తారు.
తొలిరోజు విజేతలు
● శాకాహారం విభాగంలో బి.ప్రశాంతిశ్రీ, పి.హేమ ప్రియాంక ప్రథమ, డాక్టర్ పి.శిరీష బృందం ద్వితీయ, కె.మమత తృతీయ స్థానాల్లో నిలిచారు.
● మాంసాహార వంటలకు సంబంధించి యూనివర్సిటీలోని బాయ్స్ హాస్టల్ విద్యార్థులు ప్రథమ, బి.లక్ష్మి ద్వితీయ, వై.బాబీ తృతీయ స్థానాలు పొందారు.
● న్యాయ నిర్ణేతలుగా జిల్లా రోగనిరోధక అధికారి డాక్టర్ కోమలి, కెమిస్ట్రీ అధ్యాపకురాలు బీబీ నళిని, గైనకాలజిస్టు డాక్టర్ చందన పర్వత వర్ధిని, శ్రీలక్ష్మి, ఎస్.పుష్పలత వ్యవహరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.విజయ నిర్మల, హెచ్‌ఓడీ ఆచార్య డి.కల్యాణి, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్‌కే రామచంద్ర, అడ్వకేట్ ఎ.రాజేశ్వరరావు పాల్గొన్నారు.

ఆహా ఏమి రుచి.. అతిథులు మైమరచి..

ఆహా ఏమి రుచి.. అతిథులు మైమరచి..