
దేదీప్యం.. బ్రహ్మోత్సవం
● వైభవంగా వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు
● సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై
స్వామివారి విహారం
● దర్శనానికి పోటెత్తిన భక్తులు
కొత్తపేట: వాడపల్లి క్షేత్రంలోని శ్రీ భూసమేత వేంకటేశ్వరస్వామి వారి వార్షిక దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధవారం స్వామివారు శ్రీకృష్ణుని అలంకరణలో సూర్యప్రభ, మోహినీ అలంకరణలో చంద్రప్రభ వాహనాలపై విహరించారు. రాష్ట్ర నలుమూలల నుంచి అత్యధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు వాహన సేవలను వీక్షించారు. దేవదాయ ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, పర్యవేక్షణలో ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధా న అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చక బృందం, వివిధ ప్రాంతాల వేదపండితులు పూజలు నిర్వ హించారు. డీసీ అండ్ ఈఓ చక్రధరరావు, ఉత్సవ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు దంపతులు పాల్గొన్నారు.
రెండు వాహనాలపై ఊరేగింపు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రెండు వాహనాలపై స్వామివారు ఊరేగారు. ఉదయం శ్రీకృష్ణుని అవతారంలో సూర్యప్రభ వాహంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిని దర్శించుకున్న భక్తులకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు లభిస్తాయని పండితులు తెలిపారు. అనంతరం రాత్రి శ్రీవారు మోహినీ అలంకారంతో చంద్రప్రభ వాహనంపై విహరించారు. దీని వల్ల భక్తులకు శాంతి, ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం. ఈ సందర్భంగా నిర్వహించిన మేళతాళాలు, కేరళ వాయిద్యాలు, కోలాటం, సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.
నేటి కార్యక్రమాలు
స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు గురువారం బ్రహ్మోత్సవాల నిత్య పూజలు, హోమాలు, అభిషేకాలు జరుగుతాయి. స్వామివారికి రాజాధిరాజ అలంకరణలో గజ వాహన సేవ నిర్వహిస్తారు.

దేదీప్యం.. బ్రహ్మోత్సవం