
యాచకులపై స్పెషల్ డ్రైవ్
18 మంది నేరస్తుల గుర్తింపు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా పోలీసులు సోమవారం యాచకులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నేర చరిత్ర కలిగిన 18 మందిని గుర్తించారు. గోదావరి ఘాట్లు, పరిసర ప్రాంతాల్లో కొంతమంది యాచకులు ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై మద్యం తాగి ఉంటూ, నేరా లకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు ఈ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా 193 మందిని గుర్తించగా, వారిలో 18 మందికి నేర చరిత్ర ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. విచారణ అనంతరం వీరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, మిగిలిన 175 మందికి కౌన్సెలింగ్ ఇచ్చి, స్వగ్రామాలకు పంపించామని పోలీసులు తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తామని, ఇకపై అటువంటి వ్యక్తులను గుర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
17 నుంచి ధాన్యం కొనుగోళ్లు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ఈ నెల 17 నుంచి ప్రారంభించనున్నామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ధాన్యం కొనుగోలు విధానం, కనీస మద్దతు ధర, నాణ్యతా ప్రమాణాలు, సిబ్బంది బాధ్యతలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన కరపత్రాలను కలెక్టరేట్‌లో సోమవారం ఆమె, జాయింట్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులెవ్వరూ కనీస మద్దతు ధర కంటే తక్కువకు తన పంటను అమ్మాల్సిన అవసరం లేదన్నారు. దళారులు, మధ్యవర్తులు లేకుండా రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతుందన్నారు. జేసీ మేఘా స్వరూప్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తామని చెప్పారు. జిల్లాలో మొత్తం 221 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ–క్రాప్ నమోదు చేసుకున్న రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూము నంబర్లు 1967 లేదా 83094 87151లను సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ టి.సీతారామమూర్తి, జిల్లా పౌర సరఫరాల అధికారి వి.పార్వతి తదితరులు పాల్గొన్నారు.
అర్జీల పరిష్కారానికి
వ్యక్తిగత బాధ్యత వహించాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): అర్జీల పరిష్కారానికి అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా ఆమెతోపాటు అధికారులు 137 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఏ సమయంలోనైనా తమ సమస్య తెలియజేయవచ్చని చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పట్టణ పేదలకు స్థిరమైన
జీవనోపాధి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పట్టణ ప్రాంతాల్లోని పేదలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు సృష్టించేందుకు మెప్మా ఆధ్వర్యాన జీవనోపాధి మిషన్ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్ కీర్తి తెలిపారు. ‘ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త’ బ్రోచర్‌ను జేసీ మేఘస్వరూప్‌తో కలసి ఆమె కలెక్టరేట్‌లో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల స్థాయిలో స్వయం సహాయక సంఘాల సభ్యులు, వారి కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి యూనిట్లు ఏర్పాటు చేసే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. మొదటి దశలో ప్రతి సిటీ లెవెల్ ఫెడరేషన్‌కు నాలుగు యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. అందులో మూడు కొత్తవి, ఒక అప్‌గ్రడేషన్ యూనిట్ ఉండేలా చూడాలని సూచించారు. ప్రతి స్వయం సహాయక సంఘం నుంచి కనీసం ఒక పారిశ్రామికవేత్తను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. మొత్తం 31 సంస్థల ద్వారా 51 రకాల యూనిట్ల స్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేశామని కలెక్టర్ కీర్తి తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ సీతారామమూర్తి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి.కనకరాజు, జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్ మేనేజర్ పి.శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

యాచకులపై స్పెషల్ డ్రైవ్