
అరాచక పాలనపై పోరాటం
● షెడ్యూల్ ప్రకారం
రచ్చబండ కార్యక్రమాలు
● నియోజకవర్గ ఇన్‌చార్జిల సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అరాచక పాలన, దురాగతాలపై పోరాడనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలతో బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో రాజమండ్రి పార్లమెంటరీ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని సూచించారు. సంతకాల సేకరణలో భాగంగా పార్టీ నాయకులు రచ్చబండలో పాల్గొని కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. గురుమూర్తిరెడ్డి మాట్లాడుతూ, పార్టీ గ్రామ, అనుబంధ విభాగాల కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రచ్చబండ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి తానేటి వనిత, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, తలారి వెంకటరావు, జి.శ్రీనివాసులునాయుడు, రాజమండ్రి పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.