
నకిలీ మద్యంపై సీబీఐ విచారణ
మాజీ హోం మంత్రి తానేటి వనిత డిమాండ్
దేవరపల్లి: ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యం అమ్మకాలపై సీబీఐ విచారణ జరిపించాలని మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత డిమాండ్ చేశారు. దేవరపల్లిలోని ఎౖక్సైజ్, ప్రొహిబిషన్ కార్యాలయం వద్ద సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. నకిలీ మద్యంపై వేసిన సిట్‌లోని ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ అజమాయిషీలో ఉంటారని, దీనివల్ల వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉండదని అన్నారు. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారవడం లేదనే నమ్మకం చంద్రబాబుకు ఉంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పేదల బలహీనతను ఆసరాగా తీసుకుని నకిలీ మద్యం తయారీ, అమ్మకాలతో వారి ప్రాణాలు తీయడానికి కూడా కూటమి ప్రభుత్వం వెనుకాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడి, గుడి అనే విచక్షణ లేకుండా ప్రతి వీధిలో 10 నుంచి 15 బెల్టు షాపులు ఏర్పాటు చేసి నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆరోపించారు. దీంతో మహిళలు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రతి బాటిల్‌పై అధికంగా వసూలు చేస్తూ కూటమి నాయకులు దోచుకుంటున్నారని, అయినప్పటికీ ధన దాహం తీరక నకిలీ మద్యం అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారని అన్నారు. మద్యం దుకాణాల తనిఖీ బాధ్యతను అధికారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు.