
మద్యం మహమ్మారిపై ఐద్వా పోరాటం
అమలాపురం టౌన్: మద్యం మహమ్మారిపై ఐద్వా ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని రాష్ట్ర ఐద్వా ఉపాధ్యక్షురాలు పి.పూర్ణ అన్నారు. శనివారం అమలాపురంలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా ఐద్వా మహాసభలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తొలుత ఐద్వా జిల్లా ప్రతినిధి కందికట్ల గిరిజా ఐద్వా జెండాను ఎగురవేసి మహాసభలను ప్రారంభించగా, మరో జిల్లా ప్రతినిధి కె.సుధారాణి అధ్యక్షత వహించారు. పూర్ణ మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలు, వేధింపులు, డ్రగ్స్, మహిళల ఉపాధి, తక్కువ వేతనాలు, మైక్రో ఫైనాన్స్, వడ్డీ వ్యాపారాల తదితర సమస్యలపై ఐద్వా ఎప్పుడూ పోరాటాలు చేస్తుందన్నారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో అనంతపురంలో ఐద్వా రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని చెప్పారు. ఏరులైన పారుతున్న మద్యం, బెల్ట్ షాపులతో ప్రశాంత గ్రామాల్లో లొల్లిపై రాష్ట్ర సభల్లో చర్చిస్తామన్నారు. జిల్లా ఐద్వా గౌరవాధ్యక్షురాలిగా ఆర్.సుశీల, అధ్యక్షురాలిగా జి.దైవకృప, కోశాధికారిగా సత్యవేణి, ఆఫీస్ బేరర్లుగా హైమావతి, భవాని, చంద్రకళ, ముగ్గురిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. యూటీఎఫ్ మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు సీతాదేవి, జిల్లా కార్యదర్శి చంద్రకళ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పీతల రామచంద్రరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు శంకర్ పాల్గొని సంఘీభావం తెలిపారు.