
వ్యసనాలకు బానిసై చోరీలు
కాజులూరు: వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని గొల్లపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. నెల రోజుల కిందట కోలంక శివారు గుబ్బలవారిపేటలో ఓ ఇంటి తాళాలను గుర్తు తెలియని వ్యక్తులు పగులకొట్టి చోరీకి పాల్పడ్డారు. 128 గ్రాముల బంగారు ఆభరణాలు, 334 గ్రాముల వెండి వస్తువులు దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు గొల్లపాలెం ఎస్సై ఎం.మోహన్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామానికి చెందిన ప్రమిదల శ్రీను వ్యసనాలకు బానిసై చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. శనివారం ఎస్సై తన సిబ్బందితో కలసి యానం – ద్వారపూడి రహదారిలో కోలంక శివారులో శ్రీనును అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి చోరీ సొత్తును రికవరీ చేసి, కోర్టుకు తరలించామని ఎస్సై తెలిపారు.