
దొంగ హల్‌చల్
నిడదవోలు: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌లో ఆదివారం రాత్రి ఓ దొంగ హల్‌చల్ చేశాడు. అసోం ప్రాంతానికి చెందిన యువకుడు రాత్రి 12 గంటల సమయంలో గోడ దూకి రెండంతస్తుల భవనంలోకి ప్రవేశించాడు. భవనంలో ఇద్దరు వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. వారు నిద్రిస్తున్న సమయంలో కర్ర తీసుకొచ్చిన యువకుడు తలుపులు, కిటికీలు కొడుతూ, హిందీలో తలుపు తీయాలని బిగ్గరగా కేకలు వేశాడు. ఆ దంపతులు భయపడి పైన అద్దెకుంటున్న వారికి సమాచారమిచ్చారు. వారు కిందకొచ్చి పలువురు స్థానిక యువకుల సాయంతో దొంగను పట్టుకున్నారు. కర్రతో అతడు హల్‌చల్ చేయడంతో యువకులు అతడిని నిర్బంధించారు. కాళ్లూచేతులు కట్టి పోలీసులకు సమాచారమిచ్చారు. నైట్‌బీట్‌లో ఒకే కానిస్టేబుల్ ఉండటంతో దొంగను తీసుకెళ్లడానికి తీవ్ర జాప్యం జరిగింది. స్థానికులు నిద్రపోకుండా దొంగకు కాపలాగా ఉన్నారు. సమాచారం తెలుసుకున్న టూటౌన్ ఎస్సై సీహెచ్ పరమహంస అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. దొంగపై దాడి చేసిన యువకులపై ఎస్సై మండిపడ్డారు. ఈ క్రమంలో పలువురు మహిళలు ఎస్సైతో వాగ్వాదానికి దిగా రు. చివరకు వేకువజామున మూడు గంటల సమయంలో యువకులు దొంగను పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. పట్టణ ఎస్సై జగన్‌మోహన్‌రావు ఆ దొంగ మానసిన పరిస్థితిపై ఆరా తీశారు. అతడి మానసిక స్థితి బాగోలేకనే ఇలా చేశాడని, అసోంలో ఉన్న అతడి బంధువులకు సమాచారం అందించామని చెప్పారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జగన్‌మోహన్‌రావు తెలిపారు.
పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు