
అంతర్జాతీయ వేదికపై ప్రదర్శన గర్వకారణం
బాలాజీచెరువు (కాకినాడ): అంతర్జాతీయ వేదికపై శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్ విద్యార్థులు ప్రదర్శనలిచ్చి ప్రతిభ చూపడం గర్వకారణమని శ్రీప్రకాష్ స్కూల్ డైరెక్టర్ సీహెచ్ విజయప్రకాష్ అన్నారు. కజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్(తాష్కెంట్)లో సాంస్కృతిక పర్యటన విజయవంతంగా పూర్తి చేసి, స్వదేశానికి వచ్చిన విద్యార్థుల బృందాన్ని సోమవారం అభినందించారు. కింగ్ లియర్, జూలియస్ సీజర్ వంటి క్లాసిక్ నాటకాలను అత్యున్నత స్థాయిలో ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారన్నారు. భారతీయ సాంస్కృతిక సంబంధ పరిషత్, స్వామి వివేకానంద సాంస్కృతిక కేంద్రం సహకారంతో భారత రాయబార కార్యాలయం (అస్తానా, కజికిస్తాన్) సమన్వయంతో విజయవంతంగా ప్రదర్శనలు ఇచ్చారన్నారు. విద్యార్థుల జీవితాల్లో ఇది స్ఫూర్తిదాయక మైలురాయి అవుతుందని విజయ్ ప్రకాష్ తెలిపారు.