
రూ.లక్ష విలువైన ప్లాస్టిక్ కవర్ల పట్టివేత
కపిలేశ్వరపురం (మండపేట): మండపేట పట్టణంలో సోమవారం మున్సిపల్ అధికారులు రూ.లక్ష విలువైన ప్లాస్టిక్ కవర్లను పట్టుకున్నారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధించిన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు పట్టణంలోని దుకాణాలకు వినియోగదారుల్లా వెళ్లి కవర్లు అడిగి తీసుకున్నారు. అనంతరం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. వాణిమహల్ రోడ్ పాత విక్టరీ బజార్ ఎదురుగా ఉన్న హోల్‌సేల్ ప్లాస్టిక్ కవర్ల దుకాణంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ ముత్యాల సత్తిరాజు ఆధ్వర్యంలోని సిబ్బంది దాడి చేశారు. స్వాధీనం చేసుకున్న ప్లాస్టిక్ కవర్లను మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. కమిషనర్ టీవీ రంగారావు మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు అమ్మినా, కొనుగోలు చేసినా, వినియోగించినా జరిమానా విధిస్తామని హెచ్చరించారు.