
సానుకూల దృక్పథంతో ప్రజా సమస్యల పరిష్కారం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రజా సమస్యల పరిష్కారంలో సానుకూల దృక్పథం కలిగి ఉండాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, డీఆర్‌ఓ సీతారామమూర్తితో కలసి ప్రజల నుంచి ఆమె 149 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ 78, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 24, హోం 11, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖకు సంబంధించి 10 చొప్పున అర్జీలు అందాయి. మరో 9 శాఖలకు సంబంధించి 26 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ, మండల, డివిజన్ స్థాయి సమస్యలు జిల్లా స్థాయి గ్రీవెన్స్‌కు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిని ఆయా స్థాయిల్లోనే పరిష్కరించాలని, దీనికి తహసీల్దార్, ఎంపీడీఓలు వ్యక్తిగత బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఇక నుంచి అర్జీలపై అంశాలు, మండలాల వారీగా విశ్లేషిస్తామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో అధికారులు ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చురుకుగా చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన అర్జీలు అధికంగా వస్తున్నాయని, ఈ శాఖలు తమ పని తీరు మెరుగు పరచుకోవాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో రీసర్వే చేపడుతున్నప్పుడు సంబంధిత భూ యజమానులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని, మ్యుటేషన్ దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారులు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, పిల్లలు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఉద్యాన పంటలపై నత్తల సమస్యకు సంబంధించి మండలాల వారీగా రైతుల వద్ద సర్వే నిర్వహించి, నివేదిక సమర్పించాలని హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కారానికి తగిన సూచనలు చేయాలని కలెక్టర్ సూచించారు.