
అవార్డులతో బాధ్యత మరింత పెరిగింది
రాజమహేంద్రవరం సిటీ: స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులు సాధించడం ఆనందదాయకమని, ఈ అవార్డులు మనందరి బాధ్యతను మరింతగా పెంచాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర అవార్డుల కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో జిల్లాకు మూడు రాష్ట్ర స్థాయి, 51 జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయని చెప్పారు. ఆయా అధికారులు, సంస్థల ప్రతినిధులకు ఈ అవార్డులను ఆమె అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, ముప్పిడి వెంకటేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జేసీ మేఘస్వరూప్, ఆర్‌డీఓ ఆర్.కృష్ణనాయక్ తదితరులు పాల్గొన్నారు.