
బాణసంచా పేలి అర్చకులకు గాయాలు
పి.గన్నవరం: మండలంలోని మానేపల్లి గ్రామంలో శనివారం రాత్రి దసరా మహోత్సవాల ముగింపు ఊరేగింపులో బాణసంచా పేలి ఇద్దరు అర్చకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక ఊరేగింపునకు చెందిన తారాజువ్వ, మరో ఊరేగింపు ట్రాక్టర్‌పై పడటంతో అందులో ఉన్న తారాజువ్వలు కాలి ఈ ప్రమాదం జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. మానేపల్లి శివారు శివాయలంకకు చెందిన ఊరేగింపు ఆ గ్రామ సెంటర్‌కు చేరుకుంది. అదే సమయంలో మానేపల్లి మెయిన్ గ్రామంలోని అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించేందుకు సిద్ధం చేశారు. ఈలోగా శివాయలంకకు చెందిన ఒక వ్యక్తి తారాజువ్వ వేశాడు. అది మానేపల్లి మెయిన్ ఊరేగింపు ట్రాక్టర్‌పై పడింది. దీంతో ఆ ట్రాక్టర్‌లో ఉన్న తారా జువ్వలకు నిప్పు అంటుకుంది. అక్కడున్న అర్చకులు విజయ ప్రసాద్, రత్నగోపాల్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయనున్నట్టు ఎస్సై బి.శివకృష్ణ తెలిపారు.

బాణసంచా పేలి అర్చకులకు గాయాలు