
దుర్గమ్మ విగ్రహం @ రూ.1.45 లక్షలు
దేవరపల్లి: దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా స్థానిక మూడు బొమ్మల సెంటర్‌లోని సౌభాగ్య దుర్గాంబికా ఆలయం వద్ద ప్రతిష్ఠించి, పూజలు నిర్వహించిన అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఆలయ కమిటీ ఆధ్వర్యాన శనివారం రాత్రి వేలం నిర్వహించారు. ఈ పాటలో గ్రామానికి చెందిన జుత్తిగ సత్యనారాయణ రూ.1.45 లక్షలకు అమ్మవారి విగ్రహాన్ని దక్కించుకున్నారు. ఈ విగ్రహాన్ని ఈ నెల 8వ తేదీన గ్రామంలో ఊరేగించి, నిమజ్జనం చేయనున్నారు.
మేము ఎవ్వరి భూములూ
ఆక్రమించలేదు
టీడీపీ నాయకులు కొఠారు గాంధీ, నారాయణ
నల్లజర్ల: తాము ఎవ్వరి భూములూ ఆక్రమించలేదని, ఈ విషయమై బహిరంగ విచారణకు సిద్ధమని టీడీపీ నేతలు కొఠారు గాంధీ, నారాయణ అన్నారు. ‘ఇక్కడ పెట్టుబడులు పెట్టడం దండగ’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో వచ్చిన కథనంపై వారు స్పందించారు. 1970 నుంచి పెద్దలు పంపకాలు చేసి, నిర్ణయించిన భూమి సరిహద్దులోనే తాము వ్యవసాయం చేసుకుంటున్నామన్నారు. కొఠారు ప్రదీప్ చక్రవర్తిది క్రిమినల్ మైండ్ అని అన్నారు. ఇంతవరకూ అతడి సోదరుడు భీమశంకరం, తల్లి శశిప్రభ చౌదరి ఆధీనంలోనే భూములు ఉన్నాయన్నారు. సంవత్సర కాలంగా ప్రదీప్ చక్రవర్తి అతని అన్న భీమశంకరాన్ని తన్ని తరిమేశాడని, అప్పటి నుంచీ సరిహ ద్దు రైతులమైన తమను ఇబ్బంది పెడుతూ, రాత్రి వేళల్లో కిరాయి మనుషులను తీసుకువచ్చి పొగా కు, మొక్కజొన్న పంటలు ధ్వంసం చేస్తున్నాడని ఆరోపించారు. పైపులైన్లు 15 సార్లు దొంగచాటుగా ధ్వంసం చేశాడన్నారు. ఇన్ని జరుగుతున్నా తాము ఎప్పుడూ తమ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు దృష్టికి తీసుకెళ్లలేదన్నారు. ప్రదీప్ చక్రవర్తి కుటుంబానికి చెందిన కొంత భూమి పోలవరం కుడి కాలువ నిర్మాణంలో పోయిందన్నారు. మిగిలినది కౌలుకు ఇచ్చారన్నా రు. పంట ధ్వంసం, పైపులైన్లు ధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. టవర్‌కు సంబంధించి స్థల యజమాని కొఠారు బులిరాజుపై ప్రదీప్ చక్రవర్తి హత్యాయత్నం చేయబోయాడని, టవర్ ఇనుప సామగ్రిని తన ట్రాక్టరులో వేసుకొని ఉంగుటూరు మండలం వైపు పట్టుకుపోతూంటే కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని, ఈ విషయంలో తమ ప్రమేయం లేదని చెప్పారు. ప్రదీప్ చక్రవర్తి సైకోలా ప్రవర్తిస్తాడని, అందుకే ఇంతవరకూ అతడితో ఎవరూ పెళ్లికి సిద్ధపడటం లేదని అన్నారు. మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేశాడని, ఈ విషయంలో పార్టీ వర్గాలు విచారణ జరిపి, ఆయనకు నివేదిక అందజేశాయని గాంధీ, నారాయణ చెప్పారు.