
రైతులకు ఊరటనిచ్చిన పొగాకు మార్కెట్
పొగాకు బోర్డు రాజమహేంద్రవరం
రీజియన్ పరిధిలో వేలం కేంద్రాల వారీగా పొగాకు విక్రయాలు (మిలియన్ కిలోల్లో)
దేవరపల్లి 12.10
జంగారెడ్డిగూడెం–1 14.83
జంగారెడ్డిగూడెం–2 14.82
కొయ్యలగూడెం 14.80
గోపాలపురం 13.02
దేవరపల్లి: మార్కెట్లో ఊహించని విధంగా ధర పలకడం పొగాకు రైతులకు ఊరటనిచ్చింది. గత ఏడాది ధరకు మించి పలుకుతూండటంతో ఈ ఏడాది పొగాకు రైతుల ఇంట కాసుల పంట పండిందనే చెప్పవచ్చు. కొనుగోళ్ల ప్రారంభంలో దాదాపు రెండు నెలల పాటు పొగాకు మార్కెట్ ఒడుదొడుకుల్లో కొనసాగింది. చాలా మంది రైతులు కిలో రూ.290 చొప్పున అమ్ముకున్నారు. వారిలో ఎక్కువ మంది చిన్న, సన్నకారు, కౌలు రైతులే ఉన్నారు. ఆ తరువాత అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడటం, కర్ణాటకలో పంట దెబ్బ తిని ఉత్పత్తి తగ్గడం వంటి పరిణామాలు చోటు చేసుకోవడం మన వర్జీనియా పొగాకు రైతులకు కలిసొచ్చింది. మన గ్రేడు పొగాకుకు డిమాండ్ ఏర్పడి, నానాటికీ మార్కెట్లో ధర పుంజుకుంది. పొగాకు చరిత్రలోనే కిలోకు రూ.430 గరిష్ట ధర పలకడం సరికొత్త రికార్డుగా నిలిచింది. గత ఏడాది కిలో ధర రూ.410 పలకగా, ఈ ఏడాది రైతుకు మరో రూ.20 అదనంగా దక్కింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించి, దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. రైతులు ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల మేర దిగుబడులు సాధించారు. ప్రస్తుతం కిలోకు గరిష్టంగా రూ.425, కనిష్టంగా రూ.150, సగటున రూ.310 చొప్పున రైతుకు లభిస్తోంది.
69.59 మిలియన్ కిలోల కొనుగోళ్లు
పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో శనివారం నాటికి రూ.2,157 కోట్ల విలువైన 69.59 మిలియన్ కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. దీనిలో 66.28 మిలియన్ కిలోలు ఉత్తర తేలిక నేలలు (ఎన్‌ఎల్‌ఎస్), 3.30 మిలియన్ కిలోలు బ్లాక్ సాయిల్ (బీఎస్) పొగాకు ఉన్నాయి. మార్చి 24న పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కాగా, ఇప్పటి వరకూ 156 రోజుల పాటు వేలం జరిగింది. మొత్తం 5.50 లక్షల బేళ్లు కొనుగోలు చేసినట్లు రీజినల్ మేనేజర్ జీఎల్‌కే ప్రసాద్ తెలిపారు. నిర్దేశిత కోటా మేరకు పొగాకు కొనుగోళ్లు పూర్తి కాగా, నిబంధనల మేరకు అదనపు పొగాకును కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. నవంబరు మొదటి వారంలో కొనుగోళ్లు ముగియవచ్చని తెలిపారు. ఈ ఏడాది రైతులకు మంచి ధర లభించిందన్నారు. 2025–25 పంట కాలానికి పొగాకు నాట్లు వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ నెల 15 నుంచి నాట్లు ముమ్మరంగా జరుగుతాయన్నారు.