
అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు
పెరవలి: అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే వందలాదిగా భక్తుల రాక ప్రారంభమైంది. భక్తులు క్యూలో ఆలయ ప్రాంగణం చుట్టూ బారులు తీరారు. స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామి, అమ్మవార్లను అర్చకులు విశేషంగా అలంకరించారు. స్వామివారికి వందలాది మంది భక్తులు తలనీలాలు ఇచ్చారు. దాతల ఆర్థిక సహాయంతో 9 వేల మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ప్రతి శనివారం దాతల సహకారంతో భక్తులకు అన్న సమారాధన నిర్వహిస్తున్నామని, ప్రసాదాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ తెలిపారు. స్వామివారి పుష్పాలంకరణ, ప్రసాదం, నిత్యగోత్రార్చన, అన్నదానం తదితర సేవలకు విరాళాలు స్వీకరిస్తున్నామన్నారు.
మరింత తగ్గిన గోదావరి
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి మరింత తగ్గింది. బ్యారేజీ వద్ద నీటిమట్టం శనివారం రాత్రి 9.10 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 6,06,421 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఎగువన కాళేశ్వరంలో 9.03 మీటర్లు, పేరూరు 12.03, దుమ్ముగూడెం 9.43 మీటర్లు, భద్రాచలం వద్ద 32.60 అడుగులు, కూనవరంలో 15.53 మీటర్లు, కుంట 8.08, పోలవరం 10.51, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.09 మీటర్ల మేర నీటిమట్టాలు కొనసాగుతున్నాయి.