
సచివాలయం తరలింపుపై ఆందోళన
తాళ్లపూడి (కొవ్వూరు): అధికారులు, టీడీపీ నాయకులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ సచివాలయాన్ని తరలిస్తున్నారంటూ కొవ్వూరు పట్టణంలో ప్రజలు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. స్థానిక ఐదో వార్డులో ఉన్న సచివాలయం వద్ద 5, 6 వార్డుల ప్రజలు నిరసన తెలిపారు. ఐదో వార్డు సచివాలయాన్ని ఏడో వార్డుకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీకి చెందిన ఐదో వార్డు కౌన్సిలర్ మద్దిపట్ల సాయిగీత, స్థానిక మహిళలు మాట్లాడుతూ, 5, 6, 7 వార్డులకు ఉమ్మడిగా ఉన్న సచివాలయాన్ని తమ ప్రాంతానికి దూరంగా ఉన్న ఏడో వార్డుకు మార్చడం తగదన్నారు. ఎవరి అభిప్రాయమూ తీసుకోకుండా కౌన్సిల్లో తీర్మానం చేసి తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సచివాలయం తరలింపుపై నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు, స్థానికుల అభిప్రాయాలు తీసుకోవాలని, అలా చేయకుండా ఇస్టానుసారం మార్చడమేమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న భవనానికి రూ.4,500 అద్దె చెల్లిస్తున్నారని, దీనిని ఏడో వార్డులోని భవనానికి రూ.8 వేలకు పెంచారని ఆరోపించారు. అక్కడ ప్రజలు కూడా తక్కువగా ఉన్నారని, ఈ రెండు వార్డుల్లోనే అధిక శాతం ఉన్నారని తెలిపారు. సచివాలయం మార్పును ఉపసంహరించుకోకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. సచివాలయం మార్పు వద్దని కోరుతూ వైఎస్సార్ సీపీ వార్డు కౌన్సిలర్, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, సాయిగీత, ఆమె భర్త దొరబాబు, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు చిట్టూరి అన్నవరం తదితరులు మున్సిపల్ కమిషనర్‌కు, ఇతర అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

సచివాలయం తరలింపుపై ఆందోళన