
దుర్గా.. దుర్గతినాశని..
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): దేవీ శరన్నవరాత్ర ఉత్సవాలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పలు ప్రాంతాల్లో అమ్మవారు మంగళవారం దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. పలువురు కుంకుమ పూజలు నిర్వహించారు. దసరా ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన రాజమహేంద్రవరం దేవీచౌక్‌లో శ్రీ బాలాత్రిపురసుందరీదేవి అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించారు. అమ్మవారిని సాధారణ భక్తులతో పాటు భవానీదీక్షధారులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.
ప్రభుత్వం స్పందించకపోతే
ఆందోళన తీవ్రతరం
రాజమహేంద్రవరం రూరల్: తమ న్యాయమైన డిమాండ్లకు ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఏపీ పీహెచ్‌సీ వైద్యుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ మౌనిక హెచ్చరించారు. సమ్మెలో భాగంగా పీహెచ్‌సీ వైద్యులు బొమ్మూరులోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) కార్యాలయం వద్ద మంగళవారం ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మౌనిక మాట్లాడుతూ, పీహెచ్‌సీల్లో పని చేస్తున్న వైద్యాధికారులకు పీజీ సీట్లలో 30 శాతం కోటా ఉండేదని, దీనిని కూటమి ప్రభుత్వం 15 శాతానికి తగ్గించిందని అన్నారు. దీనిపై ఆందోళన చేస్తే 20 శాతానికి పెంచిందన్నారు. దానిని ఒక ఏడాది మాత్రమే అమలు చేసి, ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020లో ఉద్యోగంలో చేరిన వైద్యులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదన్నారు. 20 ఏళ్ల నుంచి పని చేస్తున్న వైద్యులకు ప్రమోషన్లు సైతం ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని చెప్పారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేంత వరకూ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే పీహెచ్‌సీల్లో అత్యవసర సేవలు మినహా ఓపీ సేవలను బంద్ చేశామని తెలిపారు. ఈ నిరసనలో అధిక సంఖ్యలో పీహెచ్‌సీ వైద్యులు పాల్గొన్నారు.

దుర్గా.. దుర్గతినాశని..