
పీహెచ్‌సీల్లో వైద్య సేవలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
రాజమహేంద్రవరం రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) పని చేస్తున్న కొంత మంది వైద్యాధికారులు సమ్మెకు దిగిన నేపథ్యంలో ప్రజలకు నిరంతరాయంగా వైద్య సేవలు అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ కె.వెంకటేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీహెచ్‌సీల్లో పీజీ వైద్యులు, ఇతర వైద్యాధికారులను నియమించామన్నారు. జిల్లాలో పని చేస్తున్న 25 మందితో పాటు మరో 40 మంది వైద్యాధికారులను విధులకు పంపే ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 104, 108 వాహనాల సేవలు అందిస్తామని చెప్పారు. గ్రామాల్లో ఎంఎల్‌హెచ్‌పీ, సీహెచ్‌ఓల ద్వారా వైద్య సేవలు అందుతాయన్నారు. ఈ ఆదేశాలు పాటించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.