
ఏ కాటు రేబిస్ కానుందో!
తన చూపులతో.. చేష్టలతో మనుషులను వశం చేసుకునే పెంపుడు జంతువులలో కుక్క ఒకటి. ఒక్కసారి దాని ప్రేమకి లొంగిపోతే పరోక్షంగా ఆ యజమాని లేదా ఆ ఇంటి వారు దానికి బానిసలైపోయినట్టే. దానిని నెత్తినెక్కించేసుకుంటారు. ఈ ప్రేమ, వశం మాటున పెద్ద ప్రమాదం పొంచి ఉందని ఆ దాని మాయలో పడినవారికీ.. ఆ మూగజీవికి సైతం తెలియదు. తెలిసినా ఎక్కువ శాతం ఆ ప్రమాదాన్ని విస్మరిస్తారు. దాని పోషణ ఎంత ముఖ్యమో.. దాని ఆరోగ్య విషయంలోనూ అంతే జాగ్రత్తతీసుకోవాలంటారు వైద్యులు. ఆ జీవి చొంగ కానీ.. కంటి నీరు కానీ ఎంతో ప్రమాదకరమైనవి. మితిమీరి ప్రేమించేవారు దాని ముక్కమీద.. నోటి మీద ముద్దులిస్తుంటారు. అంతే కాకుండా దానికి అన్నం సైతం నోట్లో పెట్టి తినిపిస్తారు. ఈ విషయంలో అత్యంత జాగ్రత్త వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉంది. దాని నుంచి ఎటువంటి వ్యాధులు సంక్రమించకుండా.. నిర్ణీత కాల వ్యవధిలో ఏఆర్వీ ఇంజెక్షన్లు, టీకాలు, ఏ అనారోగ్యం వచ్చినా మందులు ఇప్పించాలి. లేదంటే ఆ ప్రేమ చూపించే మూగజీవే ప్రాణాంతకం కావచ్చు.
● కుక్కలతో అప్రమత్తం అంటున్న వైద్యులు
● ఈ ఏడాదిలో ఇప్పటి వరకు
3,794 కేసులు
● నేడు వరల్డ్ రేబిస్ డే
రాయవరం: జంతువులు, మనుషుల్లోను వచ్చే అతి ప్రాణాంతక వ్యాధి రేబిస్. అత్యంత ప్రమాదకరమైన వైరల్ వ్యాధుల్లో ఇది ఒకటి. దీనినే లిస్సా హైడ్రోఫోబియా అని కూడా అంటారు. ఈ వ్యాధి సోకిన జంతువులు కరవడం వల్ల మనుషులకు కూడా ఆ వ్యాధి వ్యాపిస్తుంది. కుక్కకాటు ద్వారా సంక్రమించే అతి పురాతనమైన వ్యాధి ఇది. రేబిస్ నివారణకు ప్రయత్నాలు జరుగుతున్నా నేటికీ అదుపులోకి రాకపోగా చాలా మందిని ఇది పొట్టన పెట్టుకుంటోంది. పిచ్చి కుక్క కరవడం ద్వారా వచ్చే రేబిస్ వ్యాధికి సకాలంలో చికిత్స చేస్తే పూర్తిగా నివారించే వీలుంటుంది.
వ్యాధి లక్షణాలు రెండు రకాలు
● ఉగ్రరూపం
ఈ దశలో జంతువు విపరీతమైన ఆందోళనగా ఉంటుంది. ప్రతి ఒక్కరినీ విచక్షణా రహితంగా కరుస్తూ యజమానిని గుర్తించలేదు. రాళ్లు, కర్రలు తదితర వాటిని తినడానికి ప్రయత్నిస్తుంది. ఆహారం తినదు. కళ్లు ఎర్రబడి వుండి నోటి నుంచి చొంగ విపరీతంగా కారుతుంది. గొంతు కండరాలకు పక్షవాతం వచ్చి గొంతు బొంగురు పోతుంది. నీరు తాగలేదు. అరుపులో మార్పు వస్తుంది. పిచ్చిగా పరుగులు తీసి గోడలను రుద్దు కుంటుంది. దవడలు బిగుసుకు పోతాయి. సాధారణంగా ఈ లక్షణం పిల్లుల్లో వస్తుంది.
● మూగతనం
రేబిస్ సోకిన జంతువుకి కింద దవడ వేలాడుతుంది. వ్యాధి లక్షణాలు అంతగా కనిపించవు. ముందుగా పక్షవాతం లక్షణాలు కన్పిస్తాయి. కరవలేదు. కుందేళ్లలో ఈ లక్షణం కన్పిస్తుంది.
వ్యాధి నివారణ చర్యలు
● వ్యాధికి చికిత్స లేదు. వ్యాధి నిరోధక టీకాలు (పోస్ట్ బైట్) వేయించుకోవాలి.
● రేబిస్ సోకిన కుక్క లేదా అడవి జంతువుల ద్వారా అయిన గాయాలకు వెంటనే చికిత్స చేయించాలి. యాంటీ రేబిస్ ఇమ్యునో గాబులిన్స్ ఇప్పించాలి.
● కుక్క కరిచిన గాయాలను శుభ్రంగా డిటర్జెంట్ సబ్బుతో కడగాలి.
● కార్బలిక్ యాసిడ్, టింక్చర్ అయోడిన్‌ను గాయంపై పూయాలి. యాంటీ రేబిస్ ఇమ్యునో గ్లాబ్యులిన్స్ ఇంజక్షన్ ఇవ్వాలి.
● యాంటీ రేబిస్ పోస్టుబైట్ కోర్సు 0, 3, 7, 14, 28, 90 రోజుల్లో క్రమం తప్పకుండా వ్యాక్సిన్ చేయించుకోవాలి.
● పెంపుడు కుక్కల యజమానులందరూ తప్పనిసరిగా తమ కుక్కలకు యాంటీరేబిస్ వ్యాక్సిన్ ఇప్పించేలా చట్టబద్ధం చేయాలి.
● వీధి కుక్కలకు గర్భనిరోధక ఆపరేషన్లు చేసే కార్యక్రమాలను బ్లూక్రాస్ వంటి సంస్థల సహకారంతో చేపట్టాలి.
● ఇతర దేశాలు, ప్రాంతాల నుంచి కుక్కలను తీసుకువచ్చే సమయంలో వాటికి తప్పనిసరిగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉండేలా చూడాలి.
● రేబిస్ లక్షణాలు, వ్యాప్తి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అలాగే రేబిస్ కేసుల గురించి తప్పనిసరిగా ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం ఇవ్వాలి.
● వెటర్నరీ, మెడికల్, మున్సిపల్ శాఖలు కలిసికట్టుగా రేబిస్ వ్యాధి నిరోధానికి చర్యలు చేపట్టాలి.
యాంటి రేబిస్ టీకా
పిచ్చికుక్క కరిచిన ఒక బాలుడికి 1885వ సంవత్సరంలో లూయిస్‌పాశ్చర్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా యాంటి రేబిస్ టీకా వేశారు.
వెంటనే వైద్యులను సంప్రదించాలి
కుక్క కాటుకు గురైన వ్యక్తి వెంటనే వైద్యులను సంప్రదించాలి. కుక్క కరిచిన చోట సబ్బుతో 10–15 నిమిషాలు సబ్బుతో కడగాలి. కచ్చితంగా యాంటీ రేబిస్ టీకాలు వేయించాలి. రేబిస్ వ్యాధి నివారణ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. కుక్కల సంతతిని వ్యాక్సినేషన్ ద్వారా కట్టడి చేయాలి. మీరు..నేను..సమాజం అనే స్లోగన్‌తో రేబిస్ నివారణ దినోత్సవాన్ని ఈ ఏడాది నిర్వహిస్తున్నారు.
– డాక్టర్ ఆర్‌బీ ప్రతాప్, జిల్లా సర్వైలైన్స్ అధికారి,
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
పెరిగిపోతున్న కుక్కల సంతతి
ఇటీవలి కాలంలో కుక్కల సంతతి బాగా పెరిగిపోవడంతో పలువురు కుక్కకాటు బారిన పడుతున్నారు. ఈ వ్యాధి వల్ల జిల్లాలో ఏటా వేల సంఖ్యలో కుక్కకాట్లకు గురవుతున్నారు. మనుషులే కాదు పశువులు కూడా కుక్క కాటు బారిన పడుతున్నాయి. జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు 26వ తేది వరకు 3,794 మంది కుక్కకాటు బారిన పడ్డారు. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేపడితే పూర్తిగా నివారించవచ్చునని వైద్యులు చెబుతున్నారు.
వ్యాధి స్వరూపం ఇదీ..
రేబిస్ వ్యాధి రెబ్డో వైరస్ వల్ల వస్తుంది. ఈ వ్యాధి సోకిన పశువు లేదా జంతువు కరవడం వల్ల ఇది వ్యాపిస్తుంది. రేబిస్ వ్యాధి ఎక్కువుగా కుక్కల వలనే వస్తుంది. వాటిలో లాలాజలం కళ్లు, ముక్కు, పుండు నుంచి కారుతుంది. దానిలో ఉన్న వైరస్ ఆ జంతువు కరచిన ప్రదేశం నుంచి కేంద్ర నాడీ మండలం ద్వారా మెదడుకు చేరి అక్కడ లాలాజల గ్రంధులకు చేరుతుంది. రేబిస్ వ్యాధిని పిచ్చి కుక్క వ్యాధి, హైడోఫోబియా (నీళ్లంటే భయపడడం) అని కూడా పిలుస్తారు.
ఐదేళ్ల వ్యవధిలో కుక్క కాట్లు,
మరణాల సంఖ్య ఇలా
సంవత్సరం డాగ్ బైట్స్ రేబిస్ కేసులు రేబిస్ డెత్స్
2021 4,378 0 0
2022 5,562 0 0
2023 5,215 0 0
2024 4,559 1 1
2025 జనవరి నుంచి నేటి వరకు 3,794 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి.

ఏ కాటు రేబిస్ కానుందో!

ఏ కాటు రేబిస్ కానుందో!