
అంతర్‌రాష్ట్ర దొంగల అరెస్టు
● 220.966 గ్రాముల బంగారం,
8.25 గ్రాముల వెండి వస్తువులు
● రూ.4.21లక్షల నగదు స్వాధీనం
● సొత్తు విలువ రూ.9,98,415
● డీఎస్పీ భవ్యకిషోర్
రాజమహేంద్రవరం రూరల్: కరుడుగట్టిన ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి నుంచి 220.966 గ్రాముల బంగారం, 8.25 గ్రాముల వెండి వస్తువులు, రూ.4.21 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని జిల్లా సౌత్ జోన్ డీఎస్పీ, ఇన్‌చార్జి ఈస్ట్‌జోన్ డీఎస్పీ ఎస్.భవ్యకిశోర్ తెలిపారు. మొత్తం సొత్తు విలువ రూ.9,98,415 ఉంటుందని ఆయన అన్నారు. శనివారం బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. దివాన్‌చెరువు డీబీవీ రాజు లే అవుట్‌లో నివసిస్తున్న క్యానమ్ అన్వేష్ తన తల్లి అస్తికలను గంగానదిలో కలపడానికి గత నెల 24వ తేదీన కాశీ వెళ్లి తిరిగి 27న వచ్చారు. అప్పుడు బీరువాలోని బంగారు వస్తువులు, నగదు చోరీకి గురైనట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బొమ్మూరు ఎస్సై మురళీమోహన్ కేసు నమోదు చేశారు. ఎస్పీ డి.నరసింహకిశోర్ ఆదేశాల మేరకు జిల్లా అడిషనల్ ఎస్పీ(క్రైమ్) అర్జున్ పర్యవేక్షణలో ఈస్ట్ జోన్ డీఎస్పీ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బొమ్మూరు ఇన్‌స్పెక్టర్ పి.కాశీవిశ్వనాథ్‌కు వచ్చిన సమాచారం మేరకు డీఎస్పీ భవ్యకిషోర్ పర్యవేక్షణలో సిబ్బంది ఒడిశా రాష్ట్రం బరంపురానికి చెందిన ప్రస్తుతం భువనేశ్వర్‌లో ఉంటున్న కారాడ ప్రశాంత్‌కుమార్, ఒడిస్సా రాష్ట్రం గంజామ్ ప్రాంతానికి చెందిన సాగర్‌కుమార్ పాండాను శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
2000 నుంచి నేరాల బాట : నిందితులు ప్రశాంతకుమార్, సాగర్‌కుమార్ పాండాలు 2000 సంవత్సరం నుంచి నేరాలు ప్రారంభించారని డీఎస్పీ భవ్యకిషోర్ తెలిపారు. విశాఖపట్నం పరిధిలో 11, కాకినాడ పరిధిలో నాలుగు, గుంటూరు పరిధిలో మూడు, ఒడిస్సా బరంపురంలో ఐదు, బైద్యనాథ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగు, బడాబజార్ పోలీస్‌స్టేషన్ పరిదిలో ఐదు, గుస్సాన్ నుగవు పోలీసు స్టేషన్ పరిధిలో ఎనిమిది, హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఆరు, నాగ్పూర్ ప్రతాప్‌నగర్‌లో ఆరు మొత్తం 56 కేసులు వీరి మీద ఉన్నాయన్నారు. నిందితులను రిమాండ్ కోసం ఆరో అదనపు ఫస్ట్ క్లాస్‌మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచనున్నట్టు తెలిపారు. ఈకేసులో ప్రతిభ చూపిన ఇన్‌స్పెక్టర్ కాశీవిశ్వనాథం, ఎస్సై మురళీమోహన్, బొమ్మూరు పీఎస్ హెచ్‌సీ పి.వెంకటేశ్వరరావు, సీసీఎస్ పీఎస్ హెచ్‌సీలు ఎం.ప్రసాద్, డి.వెంకటరమణ, పీసీలు కె.సురేష్‌బాబు, ఎ.మణికంఠ, ఎఆర్‌పీసీ బి.హరీష్, ఉమెన్ పీసీ పూర్ణిమరాజ్‌లను ఎస్పీ డి.నరసింహకిశోర్ అభినందించారని డిఎస్పీ భవ్యకిషోర్ తెలిపారు.