
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సీపీఆర్ రెడ్డి అన్నారు. ఈ దిశగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తూ స్థానిక ఆర్‌డీఓ కార్యాలయం వద్ద న్యాయవాదులు శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ, వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. తొలి విడతలో నాలుగు కళాశాలలను పీపీపీ పద్ధతిలో అప్పగించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక వైద్య కళాశాల మంజూరు చేసి, సామాన్యులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకు వచ్చారని గుర్తు చేశారు. గత చంద్రబాబు పాలనలో ఒక్క వైద్య కళాశాల కూడా స్థాపించలేదన్నారు. పీపీపీ అంటే ముమ్మాటికీ ప్రైవేటీకరణేనన్నారు. ఇది పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమేనని, ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని రెడ్డి డిమాండ్ చేశారు.
పుష్కర ఘాట్‌లో
ఇద్దరి గల్లంతు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్):
గోదావరిలో స్నానానికి దిగిన ఇద్దరు భవానీ భక్తులు గల్లంతైన సంఘటన స్థానిక పుష్కర ఘాట్‌లో చోటు చేసుకుంది. గోకవరం మండలం పెంటపల్లికి చెందిన గుబ్బల బాపిరాజు (28) వాచ్‌మెన్‌గా పని చేస్తూ రాజమహేంద్రవరంలో ప్రస్తుతం నివసిస్తున్నాడు. రాజానగరం మండలం శ్రీరాంపురానికి చెందిన అతడి బావమరిది రాయుడు వీరబాబు (25) హైదరాబాద్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. భవానీమాల వేసుకోవడానికి అతడు ఇటీవల ఇంటికి వచ్చాడు. బాపిరాజు, వీరబాబు కుటుంబ సభ్యులతో కలసి శనివారం సాయంత్రం రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌కు వచ్చారు. అక్కడ బాపిరాజు, వీరబాబు స్నానానికి దిగారు. నది లోతు ఎంత ఉందో తెలియక ఊబిలో దిగి ఇద్దరూ గల్లంతయ్యారు. వారి కోసం త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ అప్పారావు ఆధ్వర్యాన ఎస్సైలు, సిబ్బంది స్థానిక మత్స్యకారులతో గాలింపు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో పుష్కర్ ఘాట్ గేట్లన్నీ మూసివేశారు. ఎవ్వరూ గోదావరి స్నానాలకు వెళ్లకుండా పోలీసు గస్తీ ఏర్పాటు చేశారు. భవానీ దీక్షధారులు పుష్కర ఘాట్ శివలింగం వద్ద జల్లు స్నానాలు చేస్తున్నారు.
వేలాదిగా.. శృంగార
వల్లభుని దర్శనానికి..
పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో శృంగార వల్లభ స్వామివారిని సుమారు 30 వేల మంది దర్శించుకున్నారు. వివిధ సేవలు, కేశఖండన టికెట్లతో పాటు అన్నదాన విరాళాలు కలిపి స్వామివారికి రూ.4,77,983 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు.