పాడి గేదెలకు తక్షణ వైద్య సేవలు | - | Sakshi
Sakshi News home page

పాడి గేదెలకు తక్షణ వైద్య సేవలు

Sep 19 2025 2:01 AM | Updated on Sep 19 2025 2:01 AM

పాడి గేదెలకు తక్షణ వైద్య సేవలు

పాడి గేదెలకు తక్షణ వైద్య సేవలు

కలెక్టర్‌ కీర్తి చేకూరి ఆదేశం

పెద్దేవంలో పర్యటన

చనిపోయిన గేదెలకు పరిహారం

అందజేయాలని రైతుల విజ్ఞప్తి

తాళ్లపూడి: మండలంలోని పెద్దేవం గ్రామంలో పాడి, చూడి పశువులకు తక్షణం వైద్య సేవలు అందించాలని, వాటి ఆరోగ్య సమాచారం సేకరించి, డీవార్మింగ్‌ మందులు వేయాలని జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. అవసరమైన వాటికి చికిత్స చేయాలని సూచించారు. పెద్దేవం గ్రామంలో పాడి గేదెలు కొద్ది రోజులుగా వరుసగా అంతు చిక్కని వ్యాధితో మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ గురువారం గ్రామంలో పర్యటించారు. గ్రామానికి చెందిన జమ్ముల శ్రీను, గెడ్డం మణికంఠ తదితరుల గేదెలను పరిశీలించి పాడి రైతులు, గ్రామస్తులను కలిసి వివరాలను సేకరించారు. గేదెలు మృత్యువాత పడడానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. సుగంధి చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కీర్తి మాట్లాడుతూ, రోగవ్యాప్తి జరగకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. మృతి చెందిన గేదెల రైతుల ఇళ్ల పరిసరాలను పరిశీలించి, నీటి పరీక్షలు చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. గేదెల మృతితో ఆర్థికంగా నష్టపోయామని, ఒక్కో గేదె రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకూ ఉంటుందని, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించాలని సర్పంచ్‌ తిగిరిపల్లి వెంకట్రావు, ఉప సర్పంచ్‌ తోట రామకృష్ణ, పాడి రైతులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. కాలుష్య కాసారంలా మారిన సుగంధి చెరువును ప్రక్షాళన చేయించాలని పలువురు కోరారు. చెరువు చుట్టూ ఉన్న గేదెలకే అంతు చిక్కని వ్యాధి వచ్చినట్టు చెప్పారు. అయితే, కొందరు రైతులు ఇంటి వద్ద ఉన్న పాడి గేదెలు కూడా ఈ వ్యాధి బారిన పడ్డాయని తెలిపారు. కార్యక్రమంలో కొవ్వూరు ఆర్‌డీఓ రాణి సుస్మిత, జిల్లా పశు సంవర్ధక శాఖ, మండల అధికారులు పాల్గొన్నారు. గ్రామంలో గేదెల వరుస మరణాలకు కారణాలు తెలుసుకునేందుకు గాను మరణించిన గేదెలకు గురువారం పోస్ట్‌మార్టం చేశారు. గేదెల కిడ్నీ, లివర్‌, గుండె పాడయ్యాయని, లివర్‌ లోపల, పొట్టలో నత్తలున్నాయని చెబుతున్నారు. వీటి శాంపిల్స్‌ తీసుకుని ల్యాబ్‌కు పంపుతున్నట్లు మండల పశువైద్యాధికారి వరలక్ష్మి తెలిపారు. ఇదిలా ఉండగా, కొవ్వూరు మండలం ఐ.పంగిడి గ్రామంలో కూడా గేదెలు మృత్యువాత పడుతున్నాయనే సమాచారంతో కలెక్టర్‌ కీర్తి ఆ గ్రామంలో కూడా పర్యటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement