ప్రైవేటీకరణం | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటీకరణం

Sep 19 2025 2:01 AM | Updated on Sep 19 2025 2:01 AM

ప్రైవ

ప్రైవేటీకరణం

● మెడి‘కల’ను చిదిమేస్తారా!

వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై

ఉద్యమ బాట

నేడు వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యాన

‘చలో మెడికల్‌ కాలేజ్‌’

విద్యార్థులు, యువత, ప్రజలు పాల్గొనాలని పిలుపు

సాక్షి, రాజమహేంద్రవరం: వైద్య విద్యను అభ్యసించాలనే పేద విద్యార్థుల కలను చిదిమేసే దిశగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటిలో 5 కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయి కూడా. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు.. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో దశల వారీగా ప్రైవేటీకరించాలని ఇటీవల నిర్ణయించింది. ఈ నిర్ణయం వైద్య విద్య చదువుకోవాలనే పేద విద్యార్థులకు అశనిపాతమే అవుతోంది. మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ వలన వైద్య విద్య తమకు భారంగా మారుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలతో పాటు వైఎస్సార్‌ సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రైవేటీకరణను ఆపేందుకు ఎంత వరకై నా వెళ్లేందుకు సిద్ధమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌ సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యాన శుక్రవారం ‘చలో మెడికల్‌ కాలేజ్‌’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలో యువత, విద్యార్థులతో పాటు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆ పార్టీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

రాజమహేంద్రవరంలో సర్వాంగ సుందరంగా..

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో చారిత్రక నగరి రాజమహేంద్రవరంలో ప్రభుత్వ వైద్య కళాశాల శరవేగంగా రూపుదిద్దుకుంది. దాదాపు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో తాత్కాలిక కళాశాల నిర్మించారు. అకడమిక్‌ కార్యకలాపాలకు వీలుగా ప్రీ–ఇంజిజనీర్డ్‌ బిల్డింగ్‌ (పీఈబీ) నిర్మించారు. మరోవైపు 12 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత కళాశాల భవనాల నిర్మాణం సైతం శరవేగంగా చేపట్టారు. బోధన వైద్య కళాశాల, ఆసుపత్రి నిర్మాణ పనులను రూ.475 కోట్లతో యుద్ధప్రాతిపదికన చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ పనులు అప్పటికే సింహభాగం పూర్తయ్యాయి. కళాశాల టీచింగ్‌ స్టాఫ్‌ క్వార్టర్స్‌, మెడికో, నర్స్‌ హాస్టల్స్‌ తదితర భవనాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

వైద్యులు, సిబ్బంది నియామకం

కళాశాలలో విధులు నిర్వహించేందుకు అవసరమైన వైద్యులు, సిబ్బంది నియామక ప్రక్రియను సైతం గత ప్రభుత్వం పూర్తి చేసింది. ఆస్పత్రిలో అంతకు ముందు పని చేస్తున్న వైద్యులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసి, కొత్త వారిని నియమించారు. కళాశాలకు ప్రిన్సిపాల్‌, సూపరింటెండెంట్‌తో పాటు 120 మందికి పైగా సిబ్బందిని నియమించారు.

150 సీట్లతో అడ్మిషన్లు

కొత్త వైద్య కళాశాలలో 2023–24 విద్యా సంవత్సరం నుంచి అకడమిక్‌ కార్యకలాపాల నిర్వహణకు అప్పటి వైఎస్సార్‌ వైద్య విశ్వవిద్యాలయం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఏటా 150 సీట్లతో కళాశాల నిర్వహణకు అనుమతులు వచ్చాయి. మొదటిసారి జరిగిన అడ్మిషన్లలో 120 మంది విద్యార్థులు కళాశాలలో చేరారు. ప్రస్తుతం మూడో సంవత్సరం నడుస్తోంది. కళాశాలలో విశాలమైన ఏసీ లెక్చర్‌ రూములతో పాటు సువిశాలమైన కారిడార్లు, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగిలిన ల్యాబ్‌లకు కావాల్సిన పరికరాలను కూడా సిద్ధం చేశారు. విద్యార్థులకు హాస్టల్‌ సౌకర్యం కల్పించారు. హైజెనిక్‌ ఫుడ్‌ అందిస్తున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలోనే ఏ ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో లేని విధంగా క్లాస్‌ రూముల్లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసి, వైద్య విద్య బోధిస్తున్నారు.

శాంతియుతంగా నిరసన

వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండుతో యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యాన శుక్రవారం ‘చలో మెడికల్‌ కాలేజ్‌’ పేరిట నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఉదయం 9 గంటలకు జక్కంపూడి రాజా నివాసం నుంచి నేతలు ర్యాలీగా బయలుదేరి ప్రభుత్వ వైద్య కళాశాలకు చేరుకుంటాం. అక్కడ శాంతియుతంగా నిరసన తెలుపుతాం. యువత, విద్యార్థులు, ప్రజలు, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

– కంఠమని రమేష్‌, వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు

విద్యార్థులకు అన్యాయం

కూటమి ప్రభుత్వ హయాంలో విద్యార్థులు, యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారనే స్పష్టత లేదు. వైద్య విద్య అభ్యసించాలన్న కలపై కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం చేసే కుట్రలు మానుకోవాలి. విద్యార్థులకు అన్యాయం చేస్తే వైఎస్సార్‌ సీపీ తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం.

– మానుకొండ చంద్రబాబు, వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు

ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించాలి

వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం శాసనసభ సమావేశాల్లోనే ఉపసంహరించుకోవాలి. లేకపోతే నేపాల్‌ తరహా ప్రజాగ్రహానికి గురి కాక తప్పదు. ఇప్పటి వరకూ టీడీపీ, కూటమి ప్రభుత్వాలు ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా తీసుకొచ్చిన దాఖలాలు లేవు. 15 ఏళ్లకు పైగా సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్క మెడికల్‌ సీటు కూడా తీసుకు రాలేదు. అటువంటిది గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలోనే 5 కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభించాం. ప్రభుత్వ వైద్య కళాశాలలను పూర్తి చేస్తే.. మాజీ సీఎం జగన్‌కు పేరు వస్తుందనే దుగ్ధతోనే ప్రైవేటుకు కట్టబెడుతున్నారు. మెడికల్‌ కళాశాలల్లో సౌకర్యాలు కల్పించలేమని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడం దుర్మార్గం.

– జక్కంపూడి రాజా, వైఎస్సార్‌ సీపీ

యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు

ప్రైవేటీకరణం1
1/4

ప్రైవేటీకరణం

ప్రైవేటీకరణం2
2/4

ప్రైవేటీకరణం

ప్రైవేటీకరణం3
3/4

ప్రైవేటీకరణం

ప్రైవేటీకరణం4
4/4

ప్రైవేటీకరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement