
కూరగాయాలు
జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, గోదావరికి మూడు సార్లు సంభవించిన వరదల ధాటికి లంకల్లో, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కూరగాయల సాగుకు తీవ్రవిఘాతం కలిగింది. ఈ నేపథ్యంలో కూరగాయల పంటలు నాశనమై దిగుబడి తగ్గి రైతులకు, ధరలు అమాంతం పెరిగి వినియోగదారుల పాలిట అశనిపాతంలా మారాయి.
ఫ అమాంతం పెరిగిన ధరలు
ఫ అఽధిక వర్షాలు, వరదలతో లంకల్లో
పంటలు నాశనం
ఫ జిల్లాలో సగానికి సగం పడిపోయిన
దిగుబడి
ఫ ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి
ఫ కిలోకి రూ.10 నుంచి
రూ.30 పెరుగుదల
పెరవలి: జిల్లాలో గోదావరి వరదలు, అధిక వర్షాల వల్లముంపుబారిన పడిన కూరగాయల పంటలు తీవ్రంగా నష్టపోయాయి. కూరగాయల కొరత ఏర్పడి ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. పర్యవసానంగా కూరగాయలకు అమాంతం డిమాండ్, ధరలు పెరగడంతో సామన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఏ కూరగాయలు చూసినా కిలో రూ.40 నుంచి రూ.80 పలకడంతో సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి. దీనికి కారణం కూరగాయల పంటలు నీటమునిగి పాడైపోవటమే అంటున్నారు జనం.
కూరగాయల సాగెంత
జిల్లాలో కూరగాయల సాగు 3,629 హెక్టార్లలో సాగు జరుగుతుంది. వీటిలో దొండ, వంగ, బీర, ఆనబ, చిక్కుడు, కంద, పొట్ల, పచ్చిమిరప, క్యాబేజీ, టమాటా, బీట్‌రూట్, చిలకడదుంప, కాకర, కూరఅరటి వంటి పంటల నుంచి నిత్యం 400 టన్నుల ఉత్పత్తులు జరిగేవి. వీటిలో కేవలం 80 నుంచి 100 టన్నులు జిల్లా అవసరాలకు సరిపోగా మిగిలిన ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. ఇప్పుడు జిల్లాలో ఆ పరిస్థితి లేదు. ఎక్కువగా కూరగాయల పంటలు లంకభూముల్లో సాగు జరుగుతుండగా ఇటీవల గోదావరికి వచ్చిన వరదలతో మొత్తం పంటలు నాశనమయ్యాయి. జిల్లాలో గోదావరి లంకల్లో అన్ని రకాల కూరగాయల పంటలు సుమారు 3 వేల ఎకరాల్లో సాగు జరుగుతుండగా ఇవి అన్నీ నాశనమయ్యాయి. వీటి నుంచిి నిత్యం 200 టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతుండగా ఇవి లేకపోవడంతో ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
ఉత్పత్తులు–ఎగుమతులు–దిగుమతులు
జిల్లాలో కూరగాయలు ప్రతిరోజూ 400 టన్నుల ఉత్పత్తులు వివిధ పంటల నుంచి వస్తున్నాయి. వీటిలో ప్రథమస్థానం దొండకాయలది. ఇవి నిత్యం 150 టన్నులు ఉండగా క్యాబేజీ 100 టన్నులు ఉంటుంది. వీటి తరువాత స్థానం చిక్కుళ్లు, కూరఅరటి, ఆనబ, కంద, వంగ, బెండ, కాకర, పచ్చిమిరప వంటి పంటలు ఉన్నాయి. జిల్లాలో కేవలం 80 నుంచి 100 టన్నులు వినియోగిస్తుంటే మిగిలిన 300 టన్నులు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, ఒంగోలు పట్టణాలతో పాటు ఇతర రాష్ట్రాలైన బిహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, తమిళనాడు వంటి రాష్ట్రాలకు ఎగుమతవుతున్నాయి. కానీ వరదలు, అధిక వర్షాల కారణంగా ఈ పంటలన్నీ పాడైపోవటంతో ఇప్పడు జిల్లాకు 100 టన్నులు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతవుతున్నాయి. ఒకనాడు ఎగుమతి చేసిన జిల్లా నేడు దిగుమతులు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే అందుకు కారణం వర్షాలు, వరదలతో పంటలు నాశనమవడమే.
మార్కెట్లు
జిల్లాలో కూరగాయల మార్కెట్లు సిద్ధాంతం, ఖండవల్లి, దొమ్మేరు, రావూరుపాడు వంటి ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ మార్కెట్లకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక ఇతర జిల్లాల నుంచి కూరగాయలు వస్తుంటాయి. ఇక్కడకు వచ్చిన కూరగాయలను జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కూరగాయల వ్యాపారస్తులు కొనుగోలు చేసి తమ తమ ప్రాంతాలకు తరలిస్తారు.
ఆధారపడిన కుటుంబాలు, రైతులు
కూరగాయల సాగును కేవలం సన్న, చిన్నకారు రైతులు మాత్రమే చేస్తారు. వీరు రైతుల నుంచి కేవలం 10 నుంచి 50 సెంట్లు కౌలుకు తీసుకుని వీటిని సాగు చేస్తారు. తీసుకున్న పొలంలో రెండు నుంచి మూడుపంటలు సాగు చేసి నిత్య ఆదాయం పొందుతారు. ఈ విధంగా జిల్లాలో 60 వేల మంది రైతులు వీటిని సాగు చేస్తున్నారు. ఈ కూరగాయల సాగుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక లక్ష మంది ఆధారపడ్డారు. వీరిలో కూలీలు, వ్యాపారస్తులు ఉన్నారు. నిత్యం పొలాల్లో పండించిన ఉత్పత్తులను చేల నుంచి కోసి బయటకు తీసుకురావడానికి కూలీలు, ఇక్కడ నుంచి మార్కెట్‌కు తరలించటానికి ఆటోలు, కూరగాయల ఉత్పత్తుల కోసం వినియోగించే గోనె సంచులు ఇలా వివిధ దశళ్‌ళక్ష వీటిపై ఆధారపడిన వారే.
● పంటలు పాడైపోయాయి
కూరగాయల ధరలు పెరగడానికి లంకల్లో పంటలు పూర్తిగా పాడైపోయాయి, దీని వలన కూరగాయలకు డిమాండ్ పెరిగి ధరలు పెరిగాయి. ప్రతి రోజు కూరగాయలు మార్కెట్‌కు తీసుకెళ్లేవాడిని నేడు ఆ పరిస్థితి లేదు.
– బొలిశెట్టి వెంకటేశ్వరరావు, రైతు, అన్నవరప్పాడు
● ఆదాయం కోల్పోయాం
లంకల్లో కూరగాయల పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. దీందో ఆదాయం కోల్పోయాం. లంకల్లో రెండు ఎకరాల కూరగాయల సాగు చేశాను. మొత్తం నీటమునిగి చనిపోయాయి. ఆదాయం లేదు.
– ఉప్పులూరి శ్రీను,
రైతు, ఖండవల్లి
● కొనుగోలు తక్కువగా ఉంది
కూరగాయల వ్యాపారాన్ని నమ్ముకుని మా కుటుంబాన్ని పోషిస్తున్నాను. నిత్యం మార్కెట్ నుంచి కూరగాయలు కొనుగోలు చేసి గ్రామాల్లో అమ్ముకుంటాను. కుటుంబ పోషణకు ఎటువంటి లోటు లేదు. ఇప్పుడు ధరలు పెరగడం వలన కొనుగోలు తక్కువగా ఉంది. లాభాలు అంతంత మాత్రమే.
– ఎ.నాగరాజు,
చిరువ్యాపారి, ఖండవల్లి
కూరగాయల ధరలు (హోల్‌సేల్)
10 రోజుల ప్రస్తుత
కూరగాయ రకం క్రితం ధర ధర
(కిలోల్లో) (కిలోల్లో)
టమాటాలు రూ.20 రూ.30
బీరకాయలు రూ.20 రూ.40
బంగాళాదుంపలు రూ.20 రూ.30
వంకాయలు రూ.30 రూ.40
బెండకాయలు రూ.20 రూ.40
క్యారెట్ రూ.40 రూ.60
కాకరకాయలు రూ.40 రూ.60
దొండకాయలు రూ.20 రూ.40
చిక్కుడుకాయలు రూ.60 రూ.80
మునగకాడలు రూ.40 రూ.80
దోసకాయలు రూ.15 రూ.30
ఆనబకాయ (ఒకటి) రూ.5 రూ.15
క్యాప్సికం రూ.40 రూ.70
బీట్‌రూట్ రూ.40 రూ.60
క్యాబేజీ రూ.25 రూ.40
అల్లం రూ.40 రూ.80
పచ్చిమిర్చి రూ.30 రూ.60
కూర అరటికాయ రూ.2 రూ.5
(ఒకటి) (ఒకటి)
ఇలా కూరగాయల ధరలు ఇలా హోల్‌సేల్ మార్కెట్‌లో ఉంటే వ్యాపారస్తుల దగ్గరకు వచ్చేటప్పటికి కిలోకి మరో ఐదు రూపాయలు పెరిగి రూ.40 నుంచి రూ.80కి ధరలు పలుకుతున్నాయి.
జిల్లాలో సాగు ఎక్కడకెక్కడంటే..
జిల్లాలో కూరగాయల సాగు పెరవలి, కడియం, చాగల్లు, ఉండ్రాజవరం, కొవ్వూరు, తాళ్లపూడి, సీతానగరం, బిక్కవోలు, అనపర్తి, రాజమండ్రి రూరల్ నల్లజర్ల మండలాల్లో వీటి సాగు ఎక్కువగా ఉంది. ఈ మండలాల్లో కొన్ని గ్రామాలు ఈ కూరగాయల సాగు తప్ప మరే ఇతర పంటలు పండించడం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ కోవలోకి వచ్చేదే ఖండవల్లి, రావూరు పాడు, పెనకరమెట్ట, నందమూరు, తాళ్లపూడి, కానూరు అగ్రహారం, ముక్కామల గ్రామాలు.

కూరగాయాలు

కూరగాయాలు

కూరగాయాలు

కూరగాయాలు