స్మార్తమే అపర కర్మలకు మూలం | - | Sakshi
Sakshi News home page

స్మార్తమే అపర కర్మలకు మూలం

Sep 15 2025 8:39 AM | Updated on Sep 15 2025 8:39 AM

స్మార్తమే అపర కర్మలకు మూలం

స్మార్తమే అపర కర్మలకు మూలం

అపర విద్వత్సభలో ఘనపాఠీలు

అమలాపురం టౌన్‌: స్మార్తమే అపర కర్మలకు మూలమై మానవ మనుగడలో కీలకమైందని వేద ఘనపాఠీలు ఉద్బోధించారు. శ్రీకోనసీమ వేద శాస్త్ర సన్మాన సభ సంస్థ ఆధ్వర్యంలో అమలాపురం సుబ్బారాయుడి చెరువు వద్ద ఉన్న చంద్రమౌళీశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం స్మార్తాగమ అపర విద్వత్సభ జరిగింది. ఘనపాఠీలు మాట్లాడుతూ వేదాల నుంచే స్మార్త, ఆగమ, అపర కర్మల విధానాలు జన్మించాయని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్లమ్మ దేవస్థానం విద్వాంసులు యీవని వెంకటరామచంద్ర సోమ యాజి మాట్లాడుతూ వేదాలకు మూలం స్మార్తం అయితే, ఆ స్మార్తమే అపర కర్మలకు మూలమని అన్నారు. వైఖాసన ఆగమ పండితుడు, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విశ్రాంత ప్రధానార్చకుడు వాడపల్లి శేషాచార్యులు అపర కర్మలు నిర్వహించే విధానాలను వివరించారు. కృష్ణ యజుర్వేద పరీక్షాధికారి, పిఠాపురానికి చెందిన మహంకాళి దత్తాత్రేయశర్మ మాట్లాడుతూ కాలమాన పరిస్థితుల దృష్ట్యా షోడశ కర్మల నిర్వహణలో చిన్న చిన్న మార్పులు అనివార్యమైనా కర్మల ప్రాధాన్యం, విలువ ఏ మాత్రం తగ్గలేదన్నారు. యజుర్వేద, రుగ్వేద, అపర పండితులు భగవతి నారాయణశాస్త్రి, శైవాగమ పండితులు నవూలూరి దీక్షితులు, వాస్తు జ్యోతిష పండితులు గరిమెళ్ల భాస్కర గంగాధరశాస్త్రి మాట్లాడుతూ స్మార్త పండితులు పలు సందర్భాల్లో 16 కర్మలు నిర్వహిస్తున్నప్పుడు కర్మలు చేయించుకునే వారి సంతృప్తిని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. శ్రీకోనసీమ వేదశాస్త్ర సన్మాన సభ కార్యదర్శి గుళ్లపల్లి వెంకట్రామ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ విద్వత్సభలో సభ ప్రతినిధులు యేడిది సుబ్రహ్మణ్యశర్మ, శిష్టా భాస్కర్‌, ఆదిరాజు భాస్కరశర్మలు స్మార్త పండితులకు సత్కార సేవలు అందించారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి హాజరైన 150 మంది స్మార్త, ఆగమ, అపర పండితులు పాల్గొని వేద ఘనపాఠీలు వివరించిన స్మార్త నిబంధనలు విన్నారు. సభ చివర్లో ఇటీవల రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా నియమితులైన ఆకెళ్ల వెంకట నారాయణ అవధానిని వేదశాస్త్ర సన్మాన సభ తరఫున ఘనంగా సత్కరించారు. వేదాభిమాని పుత్సా కృష్ణ కామేశ్వర్‌ తదితరులు సేవలు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement