
ఉధృతంగా ఎర్రకాలువ
ఫ కంసాలిపాలెం–మాధవరం మధ్య
రాకపోకలు బంద్
ఫ నాలుగు గ్రామాల్లో పునరావాస కేంద్రాల ఏర్పాటు
నిడదవోలు రూరల్: భారీ వర్షాలకు ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో నిడదవోలు మండలంలోని కంసాలిపాలెం–మాధవరం వంతెన వద్ద ఆదివారం ఉదయం నుంచి నీటి ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. దీంతో వంతెనపై ప్రమాదకరస్థితిలో ఎర్రకాలువ నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. నిడదవోలు ఆర్వోబీ నిర్మాణ పనుల దృష్ట్యా అధికారులు నిడదవోలు నుంచి తాడేపల్లిగూడెం వెళ్లేందుకు సింగవరం మీదుగా తాళ్లపాలెం రైల్వే బ్రిడ్జి వద్ద నుంచి కార్లు, బైక్‌లు దారి మళ్లించారు. అయితే గత రెండురోజులుగా కురిసిన వర్షాలకు తోడు ఎర్రకాలువ నీరు చేరింది. తప్పనిసరి పరిస్థితుల్లో వాహనాదారులు ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఏటిగట్టు ప్రాంతాలను కొవ్వూరు ఆర్డీఓ రాణిసుస్మిత, తహసీల్దార్ బి.నాగరాజునాయక్, ఎంపీడీఓ వీఎస్‌వీఎల్ జగన్నాథరావు, సర్పంచ్ కొండపల్లి శ్రీనివాస్‌రావు పరిశీలించారు. ఎర్రకాలువ ప్రభావిత గ్రామాలైన కంసాలిపాలెంలో ఆహారం, తాగునీరు అందించడంతో పాటు ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో చెప్పారు. తాళ్లపాలెం, రావిమెట్ల, సింగవరం, తిమ్మరాజుపాలెం గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఎర్రకాలువ వంతెనల వద్ద గస్తీ నిర్వహిస్తున్నారు.