
వరద ముంచేను
ఫ గోదావరి తగ్గడంతో
కోలుకుంటున్న లంకలు
ఫ పంటల సంరక్షణకు జాగ్రత్తలు అవసరం
ఆలమూరు: వరద వచ్చింది.. నిండా ముంచేసింది.. లంకలను అతలాకుతలం చేసింది.. చివరికి వెనక్కి తగ్గినా బురదే మిగిల్చింది.. ఈ ఏడాది గోదావరికి మూడు సార్లు వరద వచ్చింది.. లంకల్లో వందల ఎకరాల పంటలను నీట నాన్చింది. చాలాచోట్ల పంట ఎందుకు పనికి రాకుండా పోయింది. మిగిలిన పంటలను రక్షించుకునేందుకు ఉద్యాన రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. గోదారమ్మ శాంతించడంతో ఇప్పుడిప్పుడే లంక భూములు కోలుకుంటున్నాయి. వరద తాకిడికి గురైన ఉద్యాన పంటలను జాగ్రత్తగా కాపాడుకోకపోతే నష్టం తప్పదు. ఒక్కోసారి వివిధ రకాల తెగుళ్లు సోకి పంట పూర్తిగా దెబ్బతినే ప్రమాదముందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. నీట మునిగిన పంటను ఏవిధంగా సంరక్షించుకోవాలో వివరిస్తున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట, మండపేట, రాజానగరం, రాజమహేంద్రవరం రూర ల్, పి.గన్నవరం, రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో వందలాది ఎకరాల కూరగాయల పంటలు వరద నీటి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ఈ పంట భూముల్లో వరద నీరు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండడంతో జింక్, పొటాష్, నత్రజని పోషకాలతో పాటు ఇనుము ధాతు లోపం ఏర్పడుతుంది. వాతావరణంలో తేమ అధికంగా ఉండడం వల్ల తెగుళ్లు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ తెగుళ్ల నివారణకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఉద్యాన పంటలను కాపాడుకోవచ్చని జిల్లా ఉద్యాన శాఖాధికారి పీవీ రమణ వివరించారు.
● ఆకుముడత: వరదల వల్ల కూరగాయ మొక్కల ఆకులు ముడుచుకుపోతాయి. అలాగే చీడపీడలు ఆశించినప్పుడు కూడా ఈ తెగులు సోకి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
● చీడపీడలు: వరదల వల్ల పొలాల్లో తేమ పెరిగి చీడపీడలు పెరిగి పంటలు నాశనమవుతాయి.
● వేరుకుళ్లు: వరద నీరు రోజుల తరబడి పొలాల్లో ఉంటే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఈ శిలీంధ్ర తెగులు వస్తుంది. కరవు సంభవించిన సమయంలో కూడా ఈ తెగులు ప్రభావం ఉంటుంది.
● కాండం కుళ్లు: స్ల్కీ రోషియం ఒరైజా అనే శిలీంధ్రం ద్వారా ఈ తెగులు సోకుతుంది. దీనివల్ల కూరగాయల మొక్క కాండం కుళ్లిపోయి పంట తీవ్రంగా దెబ్బతింటుంది.
● కీటకాల వృద్ధి: వరదలు సంభవించిన తరువాత ఉద్యాన పంటల్లో ఎక్కువగా ప్రమాదకరమైన బ్యాక్టీరియాతో పాటు అగ్ని చీమలు, దోమలు, బొద్దింకలు వృద్ధి చెందుతున్నాయి. ఈ కీటకాలు మొక్కల ఆకులను తినేసి పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి.
నివారణ చర్యలు
ఫ లంక భూమి వాలును అనుసరించి పొలాల్లోంచి వరద నీరు పోయే విధంగా అరడుగు వెడల్పు గల కాలువలను ఏర్పాటు చేసుకోవాలి.
ఫ నీరు ఇంకిపోయిన తరువాత వీలైనంత మేర నేలను ఆరనివ్వాలి.
ఫ జింక్ లోప నివారణకు 0.2 శాతం జింక్ సల్ఫేట్‌ను పిచికారీ చేయాలి. నత్రజని లోప నివారణకు ఒక గ్రాము కార్బన్‌డైజమ్ లేదా రెండు గ్రాముల కార్బన్‌డైజమ్‌తో పాటు మాంకోవెబ్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
ఫ ఇనుము ధాతులోపం నివారణకు 0.2 శాతం పెర్రస్ సల్ఫేట్‌ను వేయాలి.
ఫ పొటాష్, నత్రజని లోపాల నివారణకు పంట దశను అనుసరించి 0.5 శాతం నుంచి 1.0 శాతం పొటాష్ నైట్రేట్‌ను పిచికారీ చేయవచ్చు.
దొండ సాగుపై ప్రత్యేక శ్రద్ధ
వరదల సమయంలో దొండ సాగు పట్ల ఉద్యాన రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సాధారణంగా వరద నీరు నిల్వ ఉండటం వల్ల దొండ పాదుల్లో చల్లని వాతావరణం ఏర్పడుతుంది. దీనివల్ల ముఖ్యంగా బూజు, బూడిద తెగులు ఆశించే ప్రమాదముంది. బూజు తెగులు నివారణకు మాంకోజెల్ లేదా మెటాలాక్సిల్ 2 మిల్లీ లీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు నివారణకు ట్రైడీమార్ఫ్ లేదా డైనోకాప్ ఒక మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలో కలిపి వేయాలి.
సోకే తెగుళ్లు
వరద నీటిలో చిక్కుకున్న కూరగాయ పంటలకు సాధారణంగా ఆకుముడత, చీడపీడలు, వేరుకుళ్లు, కాండం కుళ్లు తదితర తెగుళ్లు సంభవించే అవకాశం ఉంది. ఉద్యాన పంటలను సస్యరక్షణ చర్యల ద్వారా కాపాడుకోవచ్చు.

వరద ముంచేను

వరద ముంచేను

వరద ముంచేను

వరద ముంచేను