
ఆటోవాలాలను రోడ్డుకీడ్చారు..
విశాఖ నుంచి అమరావతికి డ్రైవర్ పాదయాత్ర
తొండంగి: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేసిన కూటమి ప్రభుత్వం ఆటోవాలాలను రోడ్డుకీడ్చిందని విశాఖ కంచరపాలేనికి చెందిన ఆటోవాలా చింతకాయల శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌తో విశాఖపట్నం నుంచి అమరావతికి పాదయాత్ర సాగిస్తున్నాడు. అతని పాదయాత్ర సోమవారం తొండంగి మండలం జాతీయ రహదారి నుంచి సాగింది. ఈ సందర్భంగా అతను
‘సాక్షి’తో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉచిత పథకాలతో పాలనను భ్రష్టు పట్టించిందని ఆరోపించిన కూటమి నేతలు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసి ఆటోవాలాల జోవనోపాధిపై దెబ్బకొట్టారన్నారు. ఉన్నత చదువులు చదువుకున్న యువకులు, మధ్య వయస్కులు ఎందరో ఆటోలు నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారన్నారు. ఫైనాన్స్ కంపెనీలపై ఆధారపడి ఆటోలు కొనుగోలు చేసి ప్రతి నెలా ఫైనాన్స్ చెల్లించుకుంటూ ప్రభుత్వానికి ట్యాక్స్‌లు, బీమా, అప్పుడప్పుడు ఫైన్లు చెల్లిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. ఉచిత బస్సు పథకంతో ప్రస్తుతం ఆటోవాలాలంతా రోడ్డున పడ్డారన్నారు. ఈ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 2న విశాఖ నుంచి అమరావతికి పాదయాత్ర ప్రారంభించానని, తమ మనోవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే వరకూ పోరాడతానని వివరించారు.