
ఎంపీడీఓలు జాబ్‌చార్ట్‌పై అవగాహన పెంచుకోవాలి
సామర్లకోట: ఎంపీడీఓలు తమ జాబ్‌చార్ట్‌పై అవగాహన పెంచుకోవాలని, ఇదే తరుణంలో గ్రామ పంచాయతీలను సొంత వనరులతో బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని విస్తరణ శిక్షణ కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో నెల రోజుల పాటు ఎంపీడీఓలకు నిర్వహించే శిక్షణను సోమవారం ఆయన ప్రారంభించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో పదోన్నతి పొందిన 50 మందికి రెండో బ్యాచ్‌లో శిక్షణ జరుగుతుందన్నారు. ఈ మేరకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఎంపీడీఓలను వైస్ ప్రిన్సిపాల్ పరిచయం చేసుకున్నారు. గ్రామ పంచాయతీలకు సొంత వనరుల సమీకరణ, ఆర్థిక సుస్థిరత ఎంతో అవసరమని తెలిపారు. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నిధుల రూపంలో అందిస్తున్న ఆర్థిక సహాయం ఆయా గ్రామ పంచాయతీలకు సరిపోదన్నారు. గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధికి, సంక్షేమానికి వివిధ కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుందని అన్నారు. పనులు నిర్వహించే సమయంలో మండల పరిషత్తు పాలక మండలి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. ఎంపీపీల నిర్ణయాలను పాటించాల్సిన పనిలేదన్నారు. ఎంపీడీఓలు విధుల నిర్వహణలో మండల పరిషత్తుకు, ప్రభుత్వానికి బాధ్యతగా వ్యవహరించాలన్నారు. తొలిరోజు ఫ్యాకల్టీలు ఎస్‌ఎస్ శర్మ, డి.శ్రీనివాసరావు, కె.సుశీల శిక్షణ ఇచ్చారు.