
క్లోరిన్ గ్యాస్ లీకై పలువురికి అస్వస్థత
యానాం: కనకాలపేట రక్షిత తాగునీటి పథకం ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో మంగళవారం సాయంత్రం క్లోరిన్ గ్యాస్ లీక్ కావడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) ఆధ్యర్యంలో కనకాలపేటలోని ట్రీట్‌మెంట్ ప్లాంట్ నుంచి పలు గ్రామాలకు తాగునీరు అందిస్తుంటారు. ఈ నీటిని శుభ్రపరిచేందుకు సుమారు 900 కేజీల క్లోరిన్ గ్యాస్ సిలిండర్‌ను ప్రతి మూడు నెలలకు ఒక్కసారి మార్చాలి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం సిబ్బంది సిలండర్‌ను మార్చతుండగా ఒక్కసారిగా దానిలోంచి గ్యాస్ లీకై బయటకు వ్యాపించింది. దీంతో అక్కడే ఉన్న సుమారు తొమ్మిది మంది సిబ్బంది బయటకు పరుగులు తీశారు. కనకాలపేటలోని కోనవారివీధి, పాతబడివీధి, జమ్ముబాడువ తదితర గ్రామాల్లోకి గ్యాస్ వ్యాపించడంతో దాని వాసనకు పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పీడబ్ల్యూడీ ఈఈ నాగరాజు ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. అనంతరం నాగరాజు, జేఈ పెదపాటి సంతోష్, గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు వచ్చిన ఫైర్‌మన్ కోన కృష్ణారావు (బాబీ) తదితర తొమ్మిది మంది సిబ్బందితో పాటు 18 మంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని జీజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో బాధితులను ఎమ్మెల్యే అశోక్, ఆర్‌ఏవో అంకిత్ కుమార్ పరామర్శించారు. గ్యాస్‌లీక్‌ను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

క్లోరిన్ గ్యాస్ లీకై పలువురికి అస్వస్థత