
పోలీసులపై దాడి చేసిన యువకులకు జైలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మద్యం తాగి పోలీసులపై దాడి చేసిన ముగ్గురు యువకులు జైలు పాలయ్యారు. టూటౌన్ పోలీసుల విధులకు ఆటకం కలిగించడమే కాక, వారిపై చేతివాటం చూపించిన వారిని అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆ ముగ్గురు యువకులను జైలుకు పంపారు. ఆ వివరాలను సౌత్ జోన్ డీఎస్పీ భవ్యకిశోర్ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈనెల 7వ తేదీ అర్ధరాత్రి రెండో పట్టణ పోలీసులు నాగబాబు, కాళి విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో రాజానగరం మండలం పాత తుంగపాడుకు చెందిన కట్టుంగ హరీష్ (రౌడీ షీటర్), రాజమహేంద్రవరం రూరల్ రాజవోలుకు చెందిన కర్రి దుర్గా సూర్య ప్రసన్నకుమార్, ధవళేశ్వరానికి చెందిన ములపర్తి వినోద్‌కుమార్‌లు మద్యం తాగి గొడవ పడుతున్నారు. దీన్ని చూసిన నైట్‌బీట్ పోలీసులు నాగరాజు, కాళి వారి వద్దకు వెళ్లి ఆపతుండగా వారు పోలీసులపై దాడి చేశారు. దీంతో వారిపై టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు సబ్ ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్, పోలీసులు బృందం యువకుల కోసం గాలించారు. ఈస్ట్ రైల్వే స్టేషన్ వద్ద వారు ఉన్నారని సమాచారం తెలిసిన పోలీసులు ఆ ప్రాంతంలో దాడి చేసి ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.