
స్కానింగ్ సెంటర్ సీజ్
కాకినాడ క్రైం: కాకినాడలోని నూకాలమ్మ గుడి సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్కానింగ్ సెంటర్‌ను అధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు సోమవారం డీఎంహెచ్‌వో డాక్టర్ నరసింహ నాయక్ ఓ ప్రకటన విడుదల చేశారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో స్కానింగ్ సెంటర్‌లో తనిఖీలు చేసి కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాల మేరకు, ఆర్డీఓ మల్లిబాబు సమక్షంలో సీజ్ చేశామని తెలిపారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారన్న ఓ మహిళ ఫిర్యాదుతో డీఐఓ డాక్టర్ సుబ్బరాజు బృందం తనిఖీలు చేపట్టిందన్నారు. చట్టం ఉల్లంఘించిన నేపథ్యంలో వివరణ కోరగా సమాధానం సంతృప్తికరంగా లేదని వెల్లడించారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సీజ్ చేశామని డీఎంహెచ్‌ఓ తెలిపారు.
మభ్యపెట్టి.. చోరీ చేసి
ఫ ఇద్దరు నిందితుల అరెస్ట్
ఫ రూ.రెండు లక్షలు, బంగారం స్వాధీనం
అన్నవరం: కిక్కిరిసిన ఆర్టీసీ బస్సులు, ఆటోలే వారి లక్ష్యం.. అందుకే సాటి ప్రయాణికుల్లా వెళ్తారు.. అందికాడకు దోచుకుంటారు.. ప్రయాణికులను మభ్యపెట్టి వారి బ్యాగుల్లో ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ఇద్దరు మహిళలను అన్నవరం పోలీసులు సోమవారం ఆరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. రెండు లక్షలు, 106.5 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను అన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గత నెల 13న కత్తిపూడిలో ఆటోలో వెళ్తున్న ఓ మహిళ దృష్టి మరల్చి ఆమె బ్యాగ్ నుంచి రూ. రెండు లక్షలు అపహరించినట్టు అక్కడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇదే విధంగా ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆర్టీసీ బస్సులు, ఆటోల్లో ప్రయాణిస్తున్న మహిళల నుంచి బంగారం దొంగిలించినట్లు ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కాగా, సోమవారం ఉదయం కత్తిపూడి ఫ్‌లైఓవర్ దిగువన ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారు ఆ నేరాలు చేసినట్టు అంగీకరించారని సీఐ తెలిపారు. నిందుతులు తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని డ్రైవర్స్ కాలనీ తారకనగరానికి చెందిన తొండ శాంతి, అదే ప్రాంతానికి చెందిన ఆవుల భూలక్ష్మిగా గుర్తించారు. వీరి నుంచి రూ.రెండు లక్షలు, 106.5 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ ప్రత్తిపాడు కోర్టులో హాజరు పర్చనున్నారు.
సందట్లో సడేమియా..
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం నేపథ్యంలో హడావుడిలో ఉండగా, కొందరు చేతివాటం ప్రదర్శించి ఆభరణాలు, నగదు అపహరించే వీలుందని సీఐ తెలిపారు. అందువల్ల ప్రయాణ సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన అన్నవరం ఎస్‌ఐ శ్రీహరిబాబు, క్రైమ్ సిబ్బంది, కానిస్టేబుళ్లు రమణ, శ్రీనివాస్, హోంగార్డు అన్నపూర్ణలను అభినందించారు.

స్కానింగ్ సెంటర్ సీజ్