
కొత్త కోటపాడులో డయేరియా
రంగంపేట: మండలంలోని కొత్త కోటపాడు గ్రామంలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరేచనాలతో పలువురు మంచాన పడ్డారు. కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశాల మేరకు ఆ గ్రామంలో నమోదైన డయారియా కేసులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం కొత్త కోటపాడులో ప్రత్యేక వైద్య బృందంతో శిబిరం నిర్వహించి, బాధితులకు చికిత్స అందించారు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి కేసులపై విచారణ జరిపారు. ప్రభావిత ఇళ్లలో పారిశుధ్య చర్యలు చేపట్టగా, నీటిలో క్లోరినేషన్ పనులు చేయించారు. కొత్త కోటపాడులో 234 ఇళ్లలో 973 జనాభా ఉండగా, నాలుగు డయేరియా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి నియంత్రణలో ఉందని వైద్యాధికారులు తెలిపారు. వినాయక చవితి ప్రసాదం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగి డయేరియా వచ్చి ఉండవచ్చని చెప్పారు.