
పొగాకు ముంధరకొచ్చి..
● పొగాకు పంటకు మంచి రోజులు
● రైతుల మోములో ఆనందం
● కిలో గరిష్ఠ ధర రూ. 376
దేవరపల్లి: పొగాకు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.. నాలుగు రోజుల నుంచి ‘ధర’హాసం వచ్చింది.. మార్కెట్‌లో ధర పెరుగుతుండడంతో పొగాకు పంట పండింది.. రెండేళ్లుగా ఈ సాగు లాభసాటిగా ఉండడంతో అధిక శాతం రైతులు పంట వేశారు. మొన్నటి వరకూ కిలో గరిష్ఠ ధర రూ. 350 పలకగా, నాలుగు రోజుల నుంచి అంచెలంచెలుగా పెరుగుతోంది. శనివారం మార్కెట్లో కిలో రూ. 376 పలికింది. ఈ నెల 2న కిలో గరిష్ఠ ధర రూ. 350 ఉండగా, 3న రూ.362, 4వ తేదీన రూ. 375, 6వ తేదీన రూ.376 పలికింది. గరిష్ఠ ధరతో పాటు కిలో సగటు ధర కూడా పెరిగింది. సగటు ధర రూ. 299 పలికింది. దేవరపల్లి వేలం కేంద్రంలో గరిష్ఠంగా రూ.310 ధర పలికింది. గరిష్ఠ ధర రూ. 400 దాటుతుందని రైతులు ఆశిస్తున్నారు. ఒక దశలో కిలో గరిష్ఠ ధర రూ. 392 పలికిన పొగాకు కొద్ది రోజుల్లోనే పతనమై రూ. 350కు చేరింది. ఈ ధర దాదాపు 20 రోజులు నిలకడగా ఉంది. ఇంకా తగ్గుతుందని భయపడిన చిన్న రైతులు తమ వద్ద ఉన్న పొగాకును తక్కువ ధరకు అమ్ముకుని కొంత వరకూ నష్టపోయారు. గత ఏడాది కిలో గరిష్ఠ ధర రూ. 410, సగటు ధర రూ. 328 లభించింది. గత ఏడాది పొగాకు రైతుల ఇంట లాభాల పంట పండింది. మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి కొనసాగుతుంది.
రూ.1,683 కోట్ల పొగాకు విక్రయం
పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో శనివారం నాటికి సుమారు రూ.1,683 కోట్ల విలువైన 56.29 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. 58 మిలియన్ల కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇవ్వగా, సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో దాదాపు 80 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి జరిగినట్టు అధికారుల అంచనా. ఇప్పటి వరకూ 56.29 మిలియన్ల కిలోల విక్రయాలు జరగ్గా అధికారుల లెక్కల ప్రకారం మరో 32 మిలియన్ల కిలోల పొగాకు అమ్మకాలు జరగాల్సి ఉంది. బోర్డు అనుమతించిన మేరకు కోటా మరో రెండు, మూడు రోజుల్లో పూర్తి కానున్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఆశాజనకంగా దిగుబడులు
ఈ ఏడాది పొగాకు నాణ్యతతో పాటు దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌కు అవసరమైన నాణ్యత గల పొగాకును ఇక్కడి రైతులు పండించారు. ఎకరాకు 10 నుంచి 13 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. దీంతో మార్కెట్లో ఎన్‌ఎల్‌ఎస్ పొగాకుకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఎగుమతి ఆర్డర్లు ఆలస్యంగాా రావడంతో కొంతకాలం మార్కెట్ ఒడిదొడుకుల్లో కొనసాగినప్పటికీ ప్రస్తుతం కోలుకుని రైతులకు అనుకూలమైన మార్కెట్ నడుస్తుంది.
4.42 లక్షల బేళ్ల కొనుగోలు
ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతంలోని ఐదు వేలం కేంద్రాల్లో మార్చి 24న ప్రారంభమై శనివారానికి 133 రోజులు కొనుగోళ్లు జరిగాయి. 4,42,476 పొగాకు బేళ్లు కొనుగోలు చేశారు. 13 కంపెనీలు వేలంలో పాల్గొంటున్నాయి. రోజుకు సుమారు 2.60 లక్షల కిలోల పొగాకు విక్రయాలు జరుగుతున్నాయి.
అనుమతి మేరకే పండించాలి
పొగాకు బోర్డు అనుమతి మేరకు పంట పండించాలి. 2025–26 పంట కాలానికి బోర్డు నిబంధనలను కఠినతరం చేసింది. బ్యారన్‌కు 35 క్వింటాళ్ల పంట ఉత్పత్తికి అనుమతి ఉంది. ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతంలో 49 మిలియన్ల పొగాకు ఉత్పత్తికి బోర్డు నిర్ణయించింది. వచ్చే పంట కాలంలో రైతులు విధిగా పంట నియంత్రణ పాటించి, నాణ్యతపై దృష్టి పెట్టాలి. పరిమితికి లోబడే పొగాకు సాగు చేయాలి.
– జీఎల్‌కే ప్రసాద్, పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్, రాజమహేంద్రవరం
వేలం కేంద్రాల వారీగా పొగాకు కొనుగోళ్లు,
గరిష్ఠ , సగటు ధరలు ఇలా..
వేలం కేంద్రం కొనుగోలు గరిష్ఠ ధర సగటు ధర
(కిలోలు) (రూ.లలో) (రూ.లలో)
దేవరపల్లి 97,96,452 375.00 310.73
జంగారెడ్డిగూడెం–1 1,20,41,603 376.00 298.07
జంగారెడ్డిగూడెం–2 1,19,41,952 375.00 295.73
కొయ్యలగూడెం 1,18,98,189 375.00 296.64
గోపాలపురం 1,06,20,567 375.00 300.05